మళ్లీ రోడ్డెక్కిన రైతన్నలు
సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులు మళ్లీ రోడ్డెక్కారు. రెండు రోజులుగా కాంటాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నా.. మాకు కనీస సౌకర్యాలు కల్పించకపోగా, తక్కువ ధరలు వేసి మమ్మల్ని దోచుకునేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాలకు వెలితే తేమశాతం పేరుతో కొర్రీలు, డబ్బులు వెంటనే ఇవ్యరు.. మార్కెట్లకు వస్తే వ్యాపారుల దోపిడీ మేము
మరెక్కడికి వెళ్లి మా పంటను అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం రాస్తారోకో జరిపిన రైతులు శుక్రవారం రెండోరోజూ ఆందోళన చేపట్టారు. ఉదయం మార్కెట్ కార్యాలయంలోని కార్యదర్శి, చైర్మన్ గదుల్లోని ఫర్నిచర్, కుర్చీలను ధ్వసం చేశారు. వ్యాపారులు చేసిన మోసానికి కడుపుమండిన రైతులు రెండో రోజుకూడా మార్కెట్‌కు దగ్గరలోని నేషనల్ హైవే మీద రాస్తారోకోకు దిగారు. అయితే గురువారమే జేసీ సంజీవరెడ్డి వచ్చి క్వింటాళ్‌కు రూ.1,100నుంచి రూ.1,400 వరకు పడ్డ అన్ని కుప్పలకు ధర రూ.1400లు చేయాలని వ్యాపారులను ఆదేశించినా అమలు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. కలెక్టర్ వచ్చేదాకా మా రాస్తారోకో ఆగదని రైతన్నలు రోడ్డుమీదే భీష్మించారు. దీంతో కలెక్టర్ సురేంద్రమోహన్ రైతుల వద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిని మరలా మార్కెట్‌కు తీసుకువెళ్లారు.
తేమశాతం చేతితోనే..
సాధారణంగా ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి దాని ఆధారంగా వ్యాపారలు ధరలు నిర్ణయించాలి. ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో తేమశాతంను మిషన్లతో పరిశీలిస్తుండగా వ్యవసాయ మార్కెట్లో మాత్రం వ్యాపారులు, వారి గుమస్తాలు ధాన్యం తేమను చేతితోనే అంచనా వేసి ఇప్పటికి ఆశాస్త్రీయంగానే ధరలను నిర్ణయిస్తున్నారు. శుక్రవారం మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కొద్ది సేపు మార్కెట్లో తిరిగి రైతులను శాంత పరిచి కార్యాలయంలో వ్యాపారులు, కమీషన్‌దారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ «తేమశాతం ఎలా చూస్తున్నారని వ్యాపారులని ఆడుగగా చేతితో చూసి ధరలు అంచనా వేస్తామని వ్యాపారులు చెప్పడంతో ఇకనుంచి అలా కుదరదని ఖచ్చితంగా తేమశాతం చూసే మిషన్‌తోనే చూసి «మద్దతు« ధరలు రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ సురేంద్రమోహన్ చెప్పారు.
మార్కెట్ నిర్వహణలో అంతా వైఫల్యమే..
మార్కెట్ నిర్వహణలో మార్కెట్ సిబ్బంది వైఫల్యం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై జేసీ సంజీవరెడ్డి కూడా రైతులకు అనుకూలంగా మాట్లాడారు. మార్కెట్లో తేమశాతం మిషన్లు అందుబాటులో లేక పోవడంతో కార్యదర్శిపై అందోళన వ్యక్తం చేశారు. సీజన్ సమయంలో మార్కెట్‌కు ధాన్యం పోటెత్తుతుందని ముందే తెలిసినా వ్యవసాయ మార్కెట్లలో అందకు తగ్గ ఏర్పాట్లను మార్కెట్ సిబ్బంది చేయలేదు. రాత్రి సమయంలోనే ఎక్కువగా రైతులు తమ ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకు వస్తారు. అప్పుడు మార్కెట్ సిబ్బంది ఎవరూ అందుబాటులో ఉండరు. ఉదయం 11 గంటల వరకూ ఏ అధికారి కాని, సిబ్బందికాని కార్యాలయానికి రారు. అంతా కమీషన్‌దారులు, వ్యాపారులు, సెక్యూరిటీ గార్డులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే మార్కెట్ నిర్వహణను చూస్తున్నారు. వ్యాపారులు ధరలు నిర్ణయిస్తున్నప్పుడు తప్పనిసరిగా మార్కెట్ సూపర్వైజర్లు ధరల సరళిని పరిశీలించాలి. అలా చేసి ఉంటే ధరలు తక్కువ వేస్తున్నారని ముందే పసిగట్టవచ్చని..ఆదిలోనే తమ సమస్యను పరిష్కరించే అవకాశముండేది రైతులు అంటున్నారు.
మార్కెట్లోనే అధికారుల మకాం..
మార్కెట్‌కు గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో ఒక్క బస్తా కూడా గురువారం కాంటా కాలేదు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఆందోళనలో ఉన్న రైతులను కలెక్టర్ సముదాయించారు. వ్యాపారులకు అవసరముంటే ధాన్యం అమ్ముకోవచ్చని లేదంటే మీ ధాన్యాన్ని మద్దతు కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటామని కలెక్టర్ ప్రకటించారు. జేసీ సంజీవరెడ్డితో సహా వ్యవసాయ, రెవెన్యూ, కోఆపరేటివ్, సివిల్ సప్లయ్ జిల్లా అధికారులు మార్కెట్లోనే మకాం వేశారు. వారి సిబ్బందితో తేమశాతం పరిశీలన, కొన్నవారికి వెంటనే గన్నీ బ్యాగులు సరఫరా, కాంటాలు వేయించే పనిలో నిమగ్నమయ్యారు. ధాన్యం ఎక్కువగా వస్తున్నందున టోకెన్ పద్ధతితోనే ధాన్యం క్రమబద్దీకరించాల్సి ఉందని రోజు 30 వేల బస్తాలు వచ్చే విధంగా టోకెన్లు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు..
దొడ్డు, సన్నాలకు ఒకే ధర !
కొద్దిరోజుల వరకు దొడ్డు రకం ధాన్యానికి ధర రూ.1,550అటు ఇటుగా ఉండగా సన్న రకాలకు రూ.1,750 నుంచి రూ.1,900 వరకు ధర పలికింది. కాని వ్యాపారులు గురువారం సందట్లో సడేమియాలాగా సన్నరకాలకు కూడా రూ.1,550 వరకే ధరలను వేయడంతో సన్న రకాలు తెచ్చిన రైతులు జేసీ ఎదుట లదోదిబోమన్నారు. సన్నాలకు ధర బాగుందని అవి పండించామని వ్యాపారులు నిలువునా ముంచారని ఆదుకోవాలని కోరడంతో ధరలను మళ్లీ వేపిస్తామని తెలిపారు. రెండు రోజులుగా మార్కెట్లో ఇంతజరుగుతుంటే మార్కెట్ కమిటీ చైర్మన్‌గాని.. డైరెక్టర్లు గాని ఒక్కరు మార్కెట్ వైపునకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారమూ సెలవే..
గురువారం అధికంగా వచ్చిన ధాన్యానికి మార్కెట్ అధికారులు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఆదివారం ఎలాగు సెలవుకాగా సోమవారం ఒక్కరోజు మార్కెట్ నడిచే అవకాశముంది మరలా మంగళవారం మేడే సెలవు ఉంటుంది.
రైతులతో పాటుగా..
మార్కెట్ కార్యాలయాన్ని రైతులు ధ్వంసం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ విషయాన్ని చాలెంజ్‌గా తీసుకున్న జిల్లా అధికారులు వ్యవసాయ మార్కెట్లోనే మకాం వేశారు. కలెక్టర్ సురేంద్రమోహన్, జేసీసంజీవరెడ్డి రైతులతో పాటుగా శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్లోనే ఉండి కాంటాలు, బస్తాల ఎగుమతులను పర్యవేక్షించారు. వీరి వెంట సివిల్‌సప్లయ్, వ్యవసాయశాఖల అధికారులు అనురాధ, జ్యోతిర్మయి, సివిల్ సప్లయ్ మేనేజర్ రాంపతి, మార్కెట్ కార్యదర్శి ఎల్లయ్య, సిబ్బంది పోశెట్టి, అల్తాఫ్‌లు ఉన్నారు. గురువారం వచ్చిన లక్ష బస్తాల ధాన్యంలో శుక్రవారం రాత్రి వరకు 70శాతం కాంటాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మార్కెట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ నాగేశ్యర్రావు ఆధ్వర్యంలో టౌన్ సీఐ శివశంకర్. ఎస్ఐ జానకిరాములు ఉదయం నుంచి బందోబస్తు నిర్వహించారు.