సూర్యాపేట మార్కెట్‌లో ధాన్యాన్ని తగలబెడుతున్న రైతులు
భానుపురి (సూర్యాపేట): వ్యాపారులు కుమ్మక్కై ధాన్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారంటూ శనివారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులు ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందు సన్నరకానికి రూ.1,800 ఉన్న ధరను ఒక్కసారిగా రూ.1,200 తగ్గించారని, దొడ్డురకాలను రూ.1,120 ధరకే కొనడం ఏమిటని మండిపడ్డారు. దాదాపు గంటపాటు మార్కెట్ కార్యాలయం గేటు మూసేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
భారీగా ధాన్యం రావడంతో..
సూర్యాపేట జిల్లాలో వరి కోతలు మొదలయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం తెస్తున్నారు. 2 రోజులుగా 25 వేల బస్తాల మేర ధాన్యం రావడంతో ట్రేడర్లు, మిల్లర్లు ధరలు తగ్గించేశారు. సన్న రకాల ధాన్యానికి తొలుత కొందరు రైతులకు రూ.1,600 నుంచి రూ.1,800 వరకు చెల్లించారు. తర్వాత రూ.1,200 నుంచి రూ.1,400కు తగ్గించేశారు.
దొడ్డురకాలకు మరింత తక్కువ ధర ఇస్తామన్నారు. దీనితో రైతులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి సాయంత్రం మార్కెట్ యార్డుకు వచ్చారు. రైతులు, ట్రేడర్లతో మాట్లాడారు. తేమ, తాలు అధికంగా ఉండటం వల్లే కొందరు రైతులకు తక్కువ ధర ఇవ్వాల్సి వచ్చిందని ట్రేడర్లు వివరించారు. అయితే రూ.1,400కు తగ్గకుండా ధర ఇవ్వాలని, రాత్రయినా కాంటా వేయాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు సిబ్బంది ఏర్పాట్లు చేసినా.. ట్రేడర్లు ధర తక్కువే ఇస్తున్నారంటూ రైతులు మళ్లీ ఆందోళన చేశారు. కలెక్టర్ రాత్రి వరకు మార్కెట్‌లోనే ఉండి కొనుగోళ్లను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment