అమెరికా నుంచి ఫోన్.. సాయం చేస్తామని ఆఫర్
ఉగ్రవాద నిరోధక చర్యల్లో తమ నుంచి కావల్సినంత సాయం అందజేస్తామని భారతదేశానికి అమెరికా హామీ ఇచ్చింది. ఉడీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా నుంచి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసన్ రైస్ ఈ ఫోన్ చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద బృందాలు భారతీయులపై దాడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. ఉడీ ఉగ్రవాద దాడి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్‌ను కూడా కోరినట్లు చెప్పారు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికాకు చెందిన ఒక అత్యున్నత అధికారి భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌కు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్‌కు వివరించారు.