Sushant Reddy
-
డియర్ మేఘ ట్రైలర్: ప్రేమకథలకు ముగింపు లేదట!
Dear Megha Trailer: ‘‘డియర్ మేఘ’ సినిమా నా కెరీర్లో ఇంపార్టెంట్ మూవీ. ప్రేమకథని పెద్దస్థాయిలో తీయాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు ఫీలయ్యేలా చూపిస్తే చాలు’’ అని హీరో అరుణ్ అదిత్ అన్నారు. మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమాయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కథలకు ముగింపు ఉంటుందేమో కానీ ప్రేమకథలకు ముగింపు ఉండదంటూ వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా అరుణ్ అదిత్ మాట్లాడుతూ– ‘‘2009లో నా కెరీర్ ప్రారంభమైంది. తమన్నాగారితో ‘లెవెన్త్ అవర్’ వెబ్‌సిరీస్ చేస్తున్నప్పుడు ‘డియర్ మేఘ’కి ఓకే చెప్పాను. ‘‘అమ్మాయి పేరు మీద ‘డియర్ మేఘ’ అని టైటిల్ పెడుతున్నాం.. నీకు అభ్యంతరం లేదుగా?’’ అని సుశాంత్ అడిగారు. ‘నాకు కథే ముఖ్యం.. టైటిల్ కాదు’ అని చెప్పాను. హీరోగానే కాదు. నటనకు ఆస్కారం ఉండే ఎలాంటి పాత్రలైనా చేస్తాను. నేను నటించిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’, ‘కథ కంచికి మనం ఇంటికి’ రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
ఒక హీరో.. ఐదుగురు హీరోయిన్లు
‘బస్ స్టాప్’ ఫేమ్ ప్రిన్స్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. స్వీయదర్శకత్వంలో ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ చిత్రాన్ని రూపొందించిన ఎ. సుశాంత్ రెడ్డి ఈ సినిమాని కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శక–నిర్మాత సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న చిత్రమిది. తెలుగులో ‘బిగ్ బాస్ 1’లో పాల్గొన్న ప్రిన్స్ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ అభిమానం సంపాదించుకున్నాడు. మంచి కథల కోసం వెయిట్ చేస్తోన్న తనకు ఈ కథ గ్రాండ్ రీ–లాంచింగ్గా ఉండబోతోంది. ఈ చిత్రం కోసం మేకోవర్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటిస్తారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించనున్నారు. ఆ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. లఢక్, గోవా, హైదరాబాద్‌తో పాటు వారణాసి ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వి. కృష్ణారావు కొల్లూరి, బ్యానర్: సోరింగ్ ఎలిఫెంట్, కెమెరా: సామల భాస్కర్, సంగీతం: హరి గౌర, సహ నిర్మాతలు: పొనుగుమాటి దిలీప్ కుమార్, నేతి పద్మాకర్. -
కిడ్నాప్ డ్రామా
‘‘ఈ సినిమా ఐడియా నాకు బాగా నచ్చింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో నటీనటులు కాకుండా నేను, అల్లరి నరేశ్, ప్రిన్స్‌తో పాటు ఏడుగురు నటించిన పెద్ద మల్టీస్టారర్ ఇది’’ అని హీరో నాని అన్నారు. నందు, ఆదర్శ్, భూపాల్, పూనమ్‌కౌర్, శ్రద్ధాదాస్ ముఖ్య తారలుగా సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో లక్కీ క్రియేషన్స్ పతాకంపై చందు పెన్మత్స నిర్మిస్తున్న ‘సూపర్‌స్టార్ కిడ్నాప్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని హీరో శ్రీకాంత్ ఆవిష్కరించి, తొలి ప్రతిని ఏపీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డికి అందించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహించని సంఘటనల వల్ల చిక్కుల్లో పడిన ముగ్గురు యువకులు సూపర్‌స్టార్ మహేశ్‌బాబును కిడ్నాప్ చేయాలనుకుంటారు. వారు చేసిన ప్లాన్ ప్రకారం కిడ్నాప్ జరిగిందా లేదా అనేది తెరపైనే చూడాలి’’ అని చెప్పారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్ చేశానని నందు తెలిపారు. ఈ కార్యక్రమంలో రానా, సుదీప్, తనీష్, నిఖిల్, ఖయ్యూమ్, వరుణ్ సందేశ్, ప్రిన్స్, శ్రీనివాస్ అవసరాల, సాయికార్తీక్, శశాంక్ తదితరులు మాట్లాడారు.