కౌడిపల్లి తహశీల్దార్ సస్పెన్షన్
కౌడిపల్లి, న్యూస్‌లైన్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను బాధితులకు చెల్లించేందుకు ముడుపులు అడిగిన స్థానిక తహశీల్దార్‌పై వేటు పడింది. బాధితుల నుంచి రూ. పదివేలు డిమాండ్ చేయగా వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ శరత్ బుధవారం కౌడిపల్లి తహశీల్ కార్యాలయంలో విచరణ చేపట్టారు. విచారణలో వాస్తవాలు వెలుగు చూడడంతో స్థానిక తహశీల్దార్ సుభాష్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ జేసీ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
దీంతో వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం గత డిసెంబర్లో రూ .లక్ష చొప్పున మంజూరు చేసింది. కాగా ఈ డబ్బులను బాధిత కుటుంబాలకు ఇప్పటికే పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చెక్కు పంపిణీ చేసేందుకు స్థానిక తహశీల్దార్ సుభాష్‌రెడ్డి ఒక్కొక్కరి నుంచి రూ. 10వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో జేసీ శరత్ బుధవారం విచారణ చేపట్టారు. ముడుపుల విషయమై తహశీల్దార్‌ను జేసీ ప్రశ్నించగా రెడ్‌క్రాస్ సొసైటీ పేరిట డబ్బులు అడిగిన మాట వాస్తవమేనన్నారు. మరి కొందరు బాధితులు సైతం తహశీల్దార్ డబ్బులు ఇస్తేనే చెక్కు ఇస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. వారి వాంగ్మూలం మేరకు జేసీ తహశీల్దార్‌ను సస్పెండ్ చేశారు.
బాధితులకు పంపిణీ చేయాలి
బాధితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన డబ్బులను గురువారం బాధితులను కార్యాలయానికి పిలిపించి పంపిణీ చేయాలని మెదక్ ఆర్డీఓ వనజాదేవిని జేసీ శరత్ ఫోన్లో ఆదేశించారు.