ఏసీబీ వలలో సీనియర్ ఆడిటర్
సాక్షి, ఒంగోలు: ‘అవినీతి అధికారులను పట్టుకునేందుకు మేము రెడీ... సమాచారం అందించేందుకు ఆలస్యం మీదే..’ అని ఏసీబీ డీఎస్పీ జె.భాస్కరరావు పేర్కొన్న మరుసటి రోజే జిల్లాలో ఒక అవినీతి అధికారి వారి వలలో చిక్కాడు. జిల్లా ఆడిట్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్‌గా పనిచేస్తున్న ఎస్.విజయభాస్కర్ ఒక వ్యక్తి నుంచి * 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇకపై ఏసీబీ అధికారులు తమ దూకుడును మరింతగా పెంచనున్నట్లు స్పష్టమవుతోంది. రెండు రోజులుగా ఏసీబీ డీఎస్పీ జిల్లాలో ఉంటూ ఈ కేసుకు సంబంధించి పక్కాగా ప్రణాళిక రూపొందించి అవినీతి అధికారిని పట్టుకున్నారు. కేసు వివరాలను డీఎస్పీ భాస్కరరావు శనివారం మధ్యాహ్నం ప్రకాశం భవనంలోని ఆడిట్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు.
పొదిలి పంచాయతీ కార్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్న కుంకాల సుబ్బయ్య 2009లో పదవీవిరమణ చేసి, 2010లో మృతి చెందారు. ఆయనకు సంబంధించి పీఆర్సీ అరియర్స్ సుమారు రూ 1.35 లక్షలు ఆడిట్ కార్యాలయం నుంచి, మరో లక్ష రూపాయల వరకు పొదిలి ట్రెజరీ నుంచి రావాల్సి ఉంది. ఈమేరకు సుబ్బయ్య కుమారుడు నాగరాజు 45 రోజులుగా జిల్లా ఆడిట్ కార్యాలయం చుట్టూ అరియర్స్ బిల్లు మంజూరు కోసం క్రమం తప్పకుండా తిరుగుతున్నాడు. బిల్లు మంజూరు చేయాలంటే తనకు రూ 6 వేలు లంచంగా ఇవ్వాలని సీనియర్ ఆడిటర్ విజయభాస్కర్ నాగరాజును డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వడం ఇష్టంలేని నాగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు రూ 5 వేలు ఇస్తానని ఆడిటర్‌ని ఒప్పించుకున్నాడు. ఈమేరకు నాగరాజు రూ 5 వేలు నగదును శనివారం మధ్యాహ్నం విజయభాస్కర్‌కు ఇస్తుండగా అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆడిటర్‌ను ఆదివారం నెల్లూరులోని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ జె.భాస్కరరావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచం కోసం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీఎస్పీ కోరారు. ఈ దాడిలో డీఎస్పీతో పాటు ఒంగోలు ఏసీబీ సీఐ టీవీ శ్రీనివాసరావు, నెల్లూరు సీఐలు కృపానందం, వెంకటేశ్వర్లు, ఒంగోలు ఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కూద్దుస్, షఫీ, రాగబాబు, సుధాకర్ పాల్గొన్నారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేకనే: నాగరాజు
తన తండ్రికి సంబంధించి పీఆర్సీ బిల్లు మంజూరు కోసం ఆడిట్ కార్యాలయంలోని సీనియర్ ఆడిటర్ విజయభాస్కర్ తనను 45 రోజులుగా తిప్పుతుండడమే కాకుండా * 6 వేలు లంచంగా ఇస్తే బిల్లు మంజూరు చేస్తానని చెప్పినట్లు బాధితుడు కుంచాల నాగరాజు విలేకరులకు తెలిపాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తెచ్చి వారి సలహా మేరకు * 5 వేలను విజయభాస్కర్‌కు ఇచ్చి ఏసీబీ అధికారులకు పట్టించినట్లు నాగరాజు పేర్కొన్నారు.