బండిపోయినా.. ఫికర్ మత్
ఎస్వీటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా క్షణాల్లో పట్టివేత
చోరీ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక యాప్
ప్రయోగాత్మకంగా సీఐ, ఎస్ఐ సెల్ఫోన్లకు ఈ సౌకర్యం
త్వరలో అందుబాటులోకి
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనం చోరీకి గురైందా?... బేఫికర్ (నిశ్చింతగా) ఉండండి. ఆ బండి రోడ్డెక్కితే చాలు క్షణాల్లో పట్టుకునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నగర పోలీసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు బషీర్‌బాగ్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్ కార్యాలయంలో ఇం దుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోంది. నేరాల నివారణకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న నగర పోలీసులు... ఇక వాహన చోరుల భరతం పట్టేందుకు సిద్ధమౌతున్నారు. వీరి ఆట కట్టించేందుకు స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం (ఎస్వీటీఎస్) పద్ధతికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎస్వీటీఎస్ యాప్‌ను ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులకు త్వరలో అందుబాటులోకి తేనున్నారు. వాహన తనిఖీల సమయంలో తనిఖీ అధికారి వద్ద ఉన్న సెల్ఫోన్లోనే తనిఖీ చేస్తున్న వాహనం చోరీ వాహనమా? కాదా అనేది తెలుసుకొనేందుకు ఎస్వీటీఎస్ యాప్ ఉపయోగపడుతుంది. వాహనం రిజిస్ట్రేషన్, ఇంజిన్ , ఛాసిస్ నెంబర్లలో ఏదో ఒకటి యాప్‌లో ఎంటర్ చేయగానే.. అది చోరీ అయిన వాహనం అయితే.. ఫలానా స్టేషన్లో, ఫలానా క్రైంనెంబర్తో కేసు రిజిస్టర్ అయిందని క్షణాల్లో పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు దాన్ని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది.
నడిరోడ్డుపైనే ఎఫ్ఐఆర్....
వాహనం చోరీ అయ్యిందని బాధితుడు ఠాణాకు వస్తే కొంతమంది ఎస్ఐలు కేసు నమోదు చేయడానికి వెనకాడతారు. కేవలం జీడీ బుక్‌లో వివరాలు రాసుకొని పంపేస్తారు. ఎక్కువగా కేసులు నమోదైతే అధికారుల నుంచి చివాట్లు తప్పవనే భయమే ఇందుకు కారణం. అయితే ఎస్వీటీఎస్ యాప్ విధానం అందుబాటులోకిస్తే కేసు నమోదుకు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎంత త్వరగా కేసు నమోదు చేస్తే అంతే త్వరగా దాన్ని పట్టుకునే ఆయుధం ఇప్పుడు పోలీసుల వద్ద ఉంది. నడిరోడ్డుపై విధుల్లో ఉన్న సమయంలో తన వాహనం పోయిందని బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసినా వెంటనే ఎస్ఐలు తాము నిల్చున్న చోటి నుంచే చోరీ వాహనం వివరాలను తన సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో పెడితే చాలు.. అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఠాణాల సిబ్బందితో పాటు సీసీఎస్ పోలీసులకు కూడా ఈ వివరాలు క్షణాల్లో చేరుతాయి.
తనిఖీలలో కీలకం....
శాంత భద్రతల పోలీసులుగాని, ట్రాఫిక్ పోలీసులు గాని ప్రతి నగరంలో ఎక్కడో ఒకచోట వాహన తనిఖీలు చేయడం పరిపాటే. ఆ సమయంలో వాహనదారుడు తన వాహనం వివరాలు చెప్పేందుకు తడపడితే.. ఎస్ఐ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో సదరు రిజిస్ట్రేషన్, ఇంజిన్ నెంబర్లలో ఏదో ఒకటి టైప్ చేస్తే.. క్షణాల్లో ఆ వాహనం చరిత్ర మొత్తం తెలిసి పోతుంది. గతంలో వాహనదారుడి వద్ద వాహనానికి సంబంధించిన పేపర్లు లేకపోతే కేవలం చలానా కట్టించుకుని వదిలేవారు. నగరంలో చోరీ చేసిన వాహనాలను నిందితులు ఇతర జిల్లాలలో విక్రయిస్తున్నారు. వాటిని రికవరీ చేయడం సాధ్యం కావడంలేదు. కాగా, నగర పోలీసుల చేతికి త్వరలో వస్తున్న ఎస్వీటీఎస్ యాప్‌ను తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల పోలీసులకు కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోనచలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఈ యాప్ తెలంగాణలోని పోలీసులందరికీ అందుబాటులోకి తెస్తే చోరీ అయిన వాహనం ఎక్కడ తిరుగుతున్నా పట్టుకొనే వీలుకలుగుతుంది.
డేటా సేకరణలో సిబ్బంది బిజీ...
ఎస్వీటీఎస్ యాప్‌ను నడిపించేందుకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సర్వర్‌తో పాటు సిబ్బందిని నియమించారు. వీరు నగరంలోని అన్ని ఠాణాల్లో చోరీ అయిన వాహనాల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సేకరించిన వివరాలను సర్వర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలన్నీ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో ఉన్న ఎస్వీటీఎస్ యాప్‌కు చేరతాయి. ఈ ఏడాది నగరంలో సుమారు 2500 వాహనాలు చోరీకి గురయ్యాయి. మరో వెయ్యి వాహనాలు గుర్తింపునకు నోచుకోక ఠాణాలలో మగ్గుతున్నాయి. వీటి పూర్తి వివరాలు ప్రస్తుతం సర్వర్‌లో అప్లోడ్ చేశారు.