'బాబూ.. ఇలాగైతే స్వచ్ఛ భారత్ ఎలా?'
హైదరాబాద్: నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛ భారత్ కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చంద్రబాబు సారథ్యంలోని కమిటీ ఏం చేస్తోంది? స్వచ్చ భారత్లో కీలక పాత్ర పోషించడంతో పాటు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈ కమిటీ చేసింది? అసలు సఫాయి కార్మికుల సమస్యలనే ఈ కమిటీ పట్టించుకోకపోవడం విడ్డూరం. ఈ కమిటీ ఇటీవల రూపొందించిన ఓ నివేదికలో సఫాయి కార్మికుల గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు, వారి వేతనాలు గురించి ఈ కమిటీ చర్చించనేలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సఫాయి కార్మికులు సమ్మె చేశారు. అయితే వారి సమస్యలు నేటికీ తీరలేదు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నేటితో సరిగ్గా (శుక్రవారం) ఏడాది పూర్తిఅయ్యింది. గతేడాది గాంధీ జయంతి రోజే మోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే స్వచ్ఛ భారత్ విజయవంతం కావాలంటే పారిశుద్ధ్య కార్మికులదే కీలక పాత్ర. సామాన్యులు మొదలు సెలెబ్రిటీల వరకు స్వచ్ఛ భారత్లో భాగస్వామ్యం అయినా.. వారు ఏదో ఒక రోజు కాసేపు ఫొటోలకు పొజులిచ్చిపోవడమే. నిరంతరం శ్రమించేది సఫాయి కార్మికులే. అలాంటిది చంద్రబాబు సారథ్యంలోని స్వచ్ఛ భారత్ కమిటీ వీరి సమస్యలను విస్మరించడం గమనార్హం.