swacha hyderabad
-
స్వచ్ఛ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్ఎంసీ మరో స్పెషల్ డ్రైవ్‌కు సిద్ధమైంది. త్వరలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ తనిఖీలను దృష్టిలో ఉంచుకొని ఇందుకు కార్యాచరణ రూపొందించింది. గతంలో పారిశుధ్యం, వల్నరబుల్ గార్బేజ్ పాయింట్ల తొలగింపు లాంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిన బల్దియా... ఈసారి పారిశుధ్యం సహా ఆయా వార్డుల్లోని ప్రధాన రహదారులపై గుంతల పూడ్చివేత, డెబ్రిస్, బురద, పిచ్చి మొక్కలు, నాలాల్లో పూడిక తొలగింపు, సీవరేజీ లైన్లు, మ్యాన్‌హోళ్లు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతులు తదితర పనులు కూడా చేయనుంది. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడం, బహిరంగ మల, మూత్ర విసర్జన కేంద్రాలను గుర్తించి శుభ్రం చేయడంతో పాటు తిరిగి అక్కడ ఆ పనులు చేయకుండా చర్యలు తీసుకోనుంది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఆయా పనులు నిర్వహించే విభాగాలన్నీ క్షేత్రస్థాయిలో పని చేస్తాయి. వార్డు యూనిట్‌గా ఈ పనులు నిర్వహిస్తారు. సంబంధిత వార్డులోని శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ, అర్బన్ బయోడైవర్సిటీ, వెటర్నరీ, యూసీడీ, ఎన్ఫోర్స్మెంట్ తదితర విభాగాలన్నీ ఇందులో పాల్గొంటాయి. స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్జీఓలను కూడా డ్రైవ్‌లో భాగస్వామ్యం చేస్తారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రెండు మూడు రోజులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. ఒక వార్డులో డ్రైవ్ నిర్వహించే సమయంలో సంబంధిత సర్కిల్లోని ఇరుగుపొరుగు వార్డుల క్షేత్రస్థాయి పారిశుధ్య సిబ్బందిలో సగం మందిని కూడా తీసుకుంటారు. మిగతా సగం మందితో ఆయా వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చూస్తారు. ఇదీ కార్యాచరణ... పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలతో ప్రత్యేక సైన్బోర్డులను ఏర్పాటు చేస్తారు. అన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, రోడ్‌సైడ్ సెంటర్లలో ఆహార పదార్థాలను పరీక్షిస్తారు. వార్డులోని అన్ని డస్ట్బిన్లు, కాంపాక్టర్లకు రంగులు వేస్తారు. ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫాగింగ్, లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపడతారు. వీధి కుక్కల సమస్యలను పరిష్కరిస్తారు. ఆయా వార్డుల పరిధిలోని పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లలో టాయ్లెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వాటి సమాచారం తెలిసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తారు. అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేయిస్తారు. స్పెషల్ డ్రైవ్‌కు ముందే జీహెచ్ఎంసీ చెత్త తరలింపు వాహనాలను సైతం నీటితో క్లీన్ చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. విజయవంతం చేయండి స్వచ్ఛ హైదరాబాద్ కోసం వార్డుల వారీగా నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్‌లో భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ కోరారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో సోమవారం కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్యక్రమ నిర్వహణకు వార్డుల్లోని మహిళా సంఘాలతో సహా అన్ని అసోసియేషన్ల సహకారం తీసుకుంటామన్నారు. కమిషనర్ లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ... స్పెషల్ డ్రైవ్‌కు సంబంధించి సర్కిల్, జోనల్ స్థాయిల్లోనూ ఆయా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
'చెత్త హైదరాబాద్ చేస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్.. చెత్త హైదరాబాద్' లా ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత విద్యను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని.. ఇంజనీరింగ్ కాలేజీపై కక్ష సాధింపు, ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించడానికే ఈ వ్యవహారం ఉందని ఆయన విమర్శించారు. 'స్వచ్ఛ హైదరాబాద్' పేరుతో చెత్త హైదరాబాద్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇస్తోన్న ఇఫ్తార్ విందు బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. హిందువులపై ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
నాలుగేళ్లూ ‘స్వచ్ఛ హైదరాబాద్’
- ఇది మొక్కుబడి కార్యక్రమం కాదు: సీఎం కేసీఆర్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ మొక్కుబడి కార్యక్రమం కాదని, వచ్చే నాలుగేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని శుభారంభంగా ఆయన అభివర్ణించారు. తాను ప్యాట్రన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పార్సిగుట్టతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని సమూలంగా మారుస్తానన్నారు. సోమవారం కేసీఆర్ స్వచ్ఛ టీమ్ సభ్యులు, అధికారుల దృష్టికి వచ్చిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం మెట్టుగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో నిర్మాణాలకు ప్రణాళిక, పద్ధతి లేకుండాపోవడంతో ఖాళీస్థలం కనిపించడం లేదని, నాలాలు ప్రమాదకరంగా మారాయని, ఇందుకు గత పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యం.. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పెన్షన్లు, ఇళ్లు, బీడీ కార్మికులు, రహదారుల విస్తరణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ లైన్ల నిర్వహణ తదితర అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. తొలుత పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నగరం అవతల ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇందుకుగానూ రెండు డబ్బాల విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఆరు వారాల్లోగా వీటిని అందజేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్త తర లింపునకు ప్రస్తుతం ఉన్న రిక్షాలకుతోడు దాదాపు రెండు వేల ఆటో ట్రాలీలను స్థానికంగా ఉండే నిరుద్యోగులకు అందజేస్తామన్నారు. 150 నుంచి 200 లారీల వరకూ సమకూరుస్తామన్నారు. ఈ చెత్తను నగరం అవతల ఉండే ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలన్నారు. 45 రోజుల్లో ఈ వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. పేదల వేదనలూ వినాలి.. బస్తీల్లోకి వెళ్లినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలను కూడా సేకరించాలని, వారికి ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం చేయిస్తామని, ఇప్పటికిప్పుడు 1,000-1,500 మందికి చికిత్స చేసేందుకు ఆస్పత్రులు సంసిద్ధత వ్యక్తం చేశాయని కేసీఆర్ చెప్పారు. కూరగాయలు, పండ్ల మార్కెట్ల వద్ద ఎక్కువగా చెత్త పేరుకుపోతున్నందున ఓ క్రమపద్ధతిని అవలంబించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సమీక్షలో మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వడదెబ్బతో జాగ్రత్త స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొంటున్న ఉద్యోగులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పగటి పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటోందని.. అందువల్ల ఉదయం 10 గంటలలోపు విధులు నిర్వర్తించాలని.. సాయంత్రం 5 తర్వాత మళ్లీ బస్తీలకు వెళ్లాలని, మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలన్నారు. -
మహోద్యమంగా స్వచ్ఛ హైదరాబాద్
సికింద్రాబాద్ ముఖచిత్రం మారుస్తా: సీఎం కేసీఆర్ సమస్యలు తీరేంత వరకూ ఇక్కడే ఉంటానని వెల్లడి ఆనంద్‌నగర్, వెంకటరమణ కాలనీల్లో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు మేముసైతం అంటూ ఫిల్మ్ నగర్లో సినీ ప్రముఖుల సందడి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం ఆదివారం నగరంలో మహోద్యమంగా సాగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మొదలుకుని మంత్రులు, ఉన్నతాధికారులు సినీ ప్రముఖులు సైతం స్వచ్ఛ హైదరాబాద్‌లో పాలుపంచుకున్నారు. ఆనంద్‌నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల్లో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. సీఎం కేసీఆర్ తాను ప్యాట్రన్‌గా ఉన్న పార్సిగుట్టలోని వివిధ బస్తీల్లో పర్యటించారు. మరోవైపు ఫిలింనగర్లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ హీరోలు వెంకటేష్, రానా, నటి రకుల్ ప్రీత్‌సింగ్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - సాక్షి, హైదరాబాద్ ‘ఆనంద’ నగర్‌గా తీర్చిదిద్దుదాం: గవర్నర్ ఆనంద్గనర్ కాలనీని.. ఆనందనగర్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని గవర్నర్ నరసింహన్ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా గవర్నర్ ఆదివారం ఉదయం ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ఆనంద్‌నగర్ కాలనీలో చెత్త నిల్వ ఉన్న ఓ ప్రాంతాన్ని, వెంకటరమణ కాలనీలో వివాదాస్పద స్థలంలో చెత్త డంపింగ్ చేసిన ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పనులు త్వరగా జరపాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించారు. అనంతరం ఆనంద్‌నగర్ కమ్యునిటీహాల్‌లో స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు చెత్తను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని గవర్నర్ సూచించారు. నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, అందువల్ల ఎవ్వరూ నాలాల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారానికి ఒక రోజు కాలనీలోని ప్రతీ ఇంటి నుండి ఒకరిని చొప్పున తీసుకుని స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని, కాలనీ వాసులు, అధికారులు కలిస్తేనే హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు. యుద్ధం చేయాల్సిందే: సీఎం కేసీఆర్ స్థానికులు సహకరిస్తే ఆరు నెలల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తనకు అప్పగించిన పార్సిగుట్టలోనే కాక సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం పరిస్థితులు పరమ అధ్వానంగా ఉన్నాయని, అందువల్ల నియోజకవర్గం మొత్తాన్ని సంస్కరించాల్సిందేనని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తాను నియోజకవర్గంలోనే ఉంటానని, మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్‌లో గతంలో తనకున్న భవనంలో ఓఎస్డీ అందుబాటులో ఉంటారని, ఏ సమస్యనైనా అక్కడ నివేదిస్తే నేరుగా తనకు చేరుతుందని చెప్పారు. ఆదివారం తాను ప్యాట్రన్‌గా ఉన్న యూనిట్‌లోని వివిధ బస్తీల్లో ‘స్థానిక’ సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యూ అశోక్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ దుర్భర పరిస్థితుల నుంచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే యుద్ధం చేయాల్సిందేనని, స్థానికంగా ప్రజలను ఒప్పిస్తే చాలని, రోడ్లు, డ్రైన్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో అందమైన ఇళ్లతో బస్తీల రూపురేఖలు మారుస్తామన్నారు. ‘‘నాలాల మీదే బంగళాలున్నాయి. వరద నీరు బయటకు పోయే దారిలేదు. అలాంటప్పుడు సీఎం అయినా ఏమీ చేయలేడు. అధికారులు కూడా పనులు చేయలేరు’’ అని చెప్పారు. మనుషులు పెరుగుతున్నా భూమి పెరగదు కనుక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 200 నుంచి 300 ఇళ్లు పోయినా లక్ష మందికి మేలు జరుగుతుందంటే అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతమాత్రాన వారికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని, ఇళ్లు ఖాళీ చేయడానికి ముందుగానే నష్టపరిహారం అందిస్తామన్నారు. వీరికి ఐడీహెచ్ కాలనీ తరహాలో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు. -
ముచ్చెమటలు పట్టించిన ఆర్టీసీ బస్సు
హైదరాబాద్: ఓ పక్క సీఎం కాన్వాయ్ దూసుకువస్తోంది. మరో పక్క రోడ్డు మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సు. ముందుకు కదిలేందుకు మొరాయించి, రూట్ క్లియర్ చేయాల్సిన అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం సీఎం కేసీఆర్ వారాసిగూడ చౌరస్తామీదుగా అంబర్‌నగర్‌కు వస్తున్నట్లు సెట్లో ఆదేశాలు అందాయి. అదే సమయంలో వారాసిగూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది. బస్సు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా మొరాయించింది. సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు దారిలేదు. దీంతో సంబంధిత అధికారులకు చెమటలు పట్టాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న చిలకలగూడ ఠాణా పోలీసులంతా కలిసి బస్సును ముందుకు నెట్టి, రోడ్డు పక్కకు చేర్చారు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ ఆ ప్రదేశాన్ని దాటి వెళ్లిపోవడంతో సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం
కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసింది : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత బీజేపీపైనే ఉందని, కాంగ్రెస్ హయాంలో దేశం దివాలా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా యువమోర్చా(బీజేవైఎం) కార్యవర్గ సమావేశం శనివారం జీడిమెట్ల సరోజిని గార్డెన్లో నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న హడావిడిలో ప్రధాని మోదీ ఫొటో లేకపోవడం సిగ్గు చేటన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాపథం నిర్వహించినప్పుడు అందరికి సమాచారం ఇచ్చే వారని పేర్కొన్నారు. కేసీఆర్ మాత్రం కేవలం పార్టీ కార్యక్రమంలాగానే అభివృద్ధి పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యువమోర్చా రాష్ట్ర ఇన్చార్జ్ ప్రదీప్‌కుమార్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి మోహన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, దీపక్ జన్‌ఖండ్, భరతసింహారెడ్డి, వారాల మహేష్, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.