
స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా సోమవారం భోలక్ పూర్ లో పర్యటిస్తోన్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రి తలసాని.
- ఇది మొక్కుబడి కార్యక్రమం కాదు: సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ మొక్కుబడి కార్యక్రమం కాదని, వచ్చే నాలుగేళ్ల పాటు దీనిని కొనసాగిస్తామని సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని శుభారంభంగా ఆయన అభివర్ణించారు. తాను ప్యాట్రన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న పార్సిగుట్టతోపాటు సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని సమూలంగా మారుస్తానన్నారు.
సోమవారం కేసీఆర్ స్వచ్ఛ టీమ్ సభ్యులు, అధికారుల దృష్టికి వచ్చిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సాయంత్రం మెట్టుగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీటిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నగరంలో నిర్మాణాలకు ప్రణాళిక, పద్ధతి లేకుండాపోవడంతో ఖాళీస్థలం కనిపించడం లేదని, నాలాలు ప్రమాదకరంగా మారాయని, ఇందుకు గత పాలకులు, స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
పారిశుద్ధ్యానికే తొలి ప్రాధాన్యం..
పారిశుద్ధ్యం, ఆరోగ్యం, పెన్షన్లు, ఇళ్లు, బీడీ కార్మికులు, రహదారుల విస్తరణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ లైన్ల నిర్వహణ తదితర అంశాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. తొలుత పారిశుద్ధ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నగరం అవతల ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇందుకుగానూ రెండు డబ్బాల విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఆరు వారాల్లోగా వీటిని అందజేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్త తర లింపునకు ప్రస్తుతం ఉన్న రిక్షాలకుతోడు దాదాపు రెండు వేల ఆటో ట్రాలీలను స్థానికంగా ఉండే నిరుద్యోగులకు అందజేస్తామన్నారు. 150 నుంచి 200 లారీల వరకూ సమకూరుస్తామన్నారు. ఈ చెత్తను నగరం అవతల ఉండే ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలన్నారు. 45 రోజుల్లో ఈ వ్యవస్థ రూపుదిద్దుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.
పేదల వేదనలూ వినాలి..
బస్తీల్లోకి వెళ్లినప్పుడు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి వివరాలను కూడా సేకరించాలని, వారికి ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యం చేయిస్తామని, ఇప్పటికిప్పుడు 1,000-1,500 మందికి చికిత్స చేసేందుకు ఆస్పత్రులు సంసిద్ధత వ్యక్తం చేశాయని కేసీఆర్ చెప్పారు. కూరగాయలు, పండ్ల మార్కెట్ల వద్ద ఎక్కువగా చెత్త పేరుకుపోతున్నందున ఓ క్రమపద్ధతిని అవలంబించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. సమీక్షలో మంత్రులు పద్మారావుగౌడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో జాగ్రత్త
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొంటున్న ఉద్యోగులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పగటి పూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా ఉంటోందని.. అందువల్ల ఉదయం 10 గంటలలోపు విధులు నిర్వర్తించాలని.. సాయంత్రం 5 తర్వాత మళ్లీ బస్తీలకు వెళ్లాలని, మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలన్నారు.