మహోద్యమంగా స్వచ్ఛ హైదరాబాద్ | change the secendrabad map says cm kcr | Sakshi
Sakshi News home page

మహోద్యమంగా స్వచ్ఛ హైదరాబాద్

Published Mon, May 18 2015 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

change the secendrabad map says cm kcr

సికింద్రాబాద్ ముఖచిత్రం మారుస్తా: సీఎం కేసీఆర్
సమస్యలు తీరేంత వరకూ ఇక్కడే ఉంటానని వెల్లడి
ఆనంద్‌నగర్, వెంకటరమణ కాలనీల్లో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు
మేముసైతం అంటూ ఫిల్మ్ నగర్‌లో సినీ ప్రముఖుల సందడి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమం ఆదివారం నగరంలో మహోద్యమంగా సాగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మొదలుకుని మంత్రులు, ఉన్నతాధికారులు సినీ ప్రముఖులు సైతం స్వచ్ఛ హైదరాబాద్‌లో పాలుపంచుకున్నారు. ఆనంద్‌నగర్ కాలనీ, వెంకటరమణ కాలనీల్లో గవర్నర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. సీఎం కేసీఆర్ తాను ప్యాట్రన్‌గా ఉన్న పార్సిగుట్టలోని వివిధ బస్తీల్లో పర్యటించారు. మరోవైపు ఫిలింనగర్‌లో నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ హీరోలు వెంకటేష్, రానా, నటి రకుల్ ప్రీత్‌సింగ్, దర్శకులు కె. రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.     - సాక్షి, హైదరాబాద్
 
‘ఆనంద’ నగర్‌గా తీర్చిదిద్దుదాం: గవర్నర్
ఆనంద్‌గనర్ కాలనీని.. ఆనందనగర్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని గవర్నర్ నరసింహన్ అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా గవర్నర్ ఆదివారం ఉదయం ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ఆనంద్‌నగర్ కాలనీలో చెత్త నిల్వ ఉన్న ఓ ప్రాంతాన్ని, వెంకటరమణ కాలనీలో వివాదాస్పద స్థలంలో చెత్త డంపింగ్ చేసిన ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ పనులు త్వరగా జరపాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించారు. అనంతరం ఆనంద్‌నగర్ కమ్యునిటీహాల్‌లో స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు చెత్తను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని గవర్నర్ సూచించారు. నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని, అందువల్ల ఎవ్వరూ నాలాల్లో వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారానికి ఒక రోజు కాలనీలోని ప్రతీ ఇంటి నుండి ఒకరిని చొప్పున తీసుకుని స్వచ్ఛ హైదరాబాద్ చేపట్టాలని, కాలనీ వాసులు, అధికారులు కలిస్తేనే హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దవచ్చని చెప్పారు.
 
యుద్ధం చేయాల్సిందే: సీఎం కేసీఆర్
స్థానికులు సహకరిస్తే ఆరు నెలల్లో సికింద్రాబాద్ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మారుస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా తనకు అప్పగించిన పార్సిగుట్టలోనే కాక సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం పరిస్థితులు పరమ అధ్వానంగా ఉన్నాయని, అందువల్ల నియోజకవర్గం మొత్తాన్ని సంస్కరించాల్సిందేనని చెప్పారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకూ తాను నియోజకవర్గంలోనే ఉంటానని, మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్‌లో గతంలో తనకున్న భవనంలో ఓఎస్డీ అందుబాటులో ఉంటారని, ఏ సమస్యనైనా అక్కడ నివేదిస్తే నేరుగా తనకు చేరుతుందని చెప్పారు. ఆదివారం తాను ప్యాట్రన్‌గా ఉన్న యూనిట్‌లోని వివిధ బస్తీల్లో ‘స్థానిక’ సభ్యులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా న్యూ అశోక్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ దుర్భర పరిస్థితుల నుంచి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే యుద్ధం చేయాల్సిందేనని, స్థానికంగా ప్రజలను ఒప్పిస్తే చాలని, రోడ్లు, డ్రైన్లతో పాటు అన్ని మౌలిక సదుపాయాలతో అందమైన ఇళ్లతో బస్తీల రూపురేఖలు మారుస్తామన్నారు. ‘‘నాలాల మీదే బంగళాలున్నాయి. వరద నీరు బయటకు పోయే దారిలేదు. అలాంటప్పుడు సీఎం అయినా ఏమీ చేయలేడు. అధికారులు కూడా పనులు చేయలేరు’’ అని చెప్పారు. మనుషులు పెరుగుతున్నా భూమి పెరగదు కనుక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 200 నుంచి 300 ఇళ్లు పోయినా లక్ష మందికి మేలు జరుగుతుందంటే అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతమాత్రాన వారికి ఎలాంటి నష్టం జరగనివ్వబోమని, ఇళ్లు ఖాళీ చేయడానికి ముందుగానే నష్టపరిహారం అందిస్తామన్నారు. వీరికి ఐడీహెచ్ కాలనీ తరహాలో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement