ఓ పక్క సీఎం కాన్వాయ్ దూసుకువస్తోంది.
హైదరాబాద్: ఓ పక్క సీఎం కాన్వాయ్ దూసుకువస్తోంది. మరో పక్క రోడ్డు మధ్యలో ఆగిన ఆర్టీసీ బస్సు. ముందుకు కదిలేందుకు మొరాయించి, రూట్ క్లియర్ చేయాల్సిన అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం సీఎం కేసీఆర్ వారాసిగూడ చౌరస్తామీదుగా అంబర్‌నగర్‌కు వస్తున్నట్లు సెట్‌లో ఆదేశాలు అందాయి. అదే సమయంలో వారాసిగూడ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది.
బస్సు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు కదలకుండా మొరాయించింది. సీఎం కాన్వాయ్ వెళ్లేందుకు దారిలేదు. దీంతో సంబంధిత అధికారులకు చెమటలు పట్టాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న చిలకలగూడ ఠాణా పోలీసులంతా కలిసి బస్సును ముందుకు నెట్టి, రోడ్డు పక్కకు చేర్చారు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ ఆ ప్రదేశాన్ని దాటి వెళ్లిపోవడంతో సంబంధిత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.