swachata
-
స్వచ్ఛత సేవలో రిలయన్స్
ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ దేశ పరిశుభ్రతలో తన వంతు పాలుపంచుకుంది. స్వచ్ఛత పక్షోత్సవాల్లో భాగంగా రిలయన్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్ ఆందోళన్‌కు విశేష స్పందన లభించింది. 75,000 మంది వాలంటీర్లు 4,100 చోట్ల స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు.భారత ప్రభుత్వ 'స్వచ్ఛతా హి సేవా' కార్యక్రమానికి మద్దతుగా రిలయన్స్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రజలు పరిశుభ్రత చర్యల్లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు. పాఠశాలల్లో స్వచ్ఛతపై విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణానికి సేవ చేయడానికి ఇది గొప్ప అవకాశమని రిలయన్స్ ఫౌండేషన్ సీఈవో జగన్నాథ కుమార్ పేర్కొన్నారు.సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ స్కూల్స్, జియో ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రిలయన్స్ వాలంటీర్లు నిర్వహించిన అవగాహన క్విజ్లు, పెయింటింగ్, వ్యాసరచన పోటీలు, ఇతర కార్యకలాపాలలో 30,000 మంది పిల్లలు పాల్గొన్నారు. రిలయన్స్ ఫౌండేషన్ ఒడిశా, అస్సాం, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో 17,000 మొక్కలను నాటింది. -
'స్వచ్ఛత పై అవగాహన కల్పించడమే లక్ష్యం'
సాక్షి, విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను బుధవారం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేశ్ మాట్లాడుతూ.. స్వచ్ఛత పై అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ వాహనాలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నగరంలోని 59 డివిజన్లలో ఈ వాహనాల ద్వారా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని తెలిపారు. దీంతో పాటు వైఎస్ఆర్ నవశకం వాహనాన్ని సైతం ప్రారంభించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. -
స్వచ్ఛతా మొబైల్ ఆప్ పోస్టర్‌ను విడుదల
కర్నూలు : పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత మొబైల్ ఆప్ పోస్టర్‌ను కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ గురువారం ఉదయం ఆవిష్కరించారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్కడైనా చెత్త ఉండే పరిసరాలను ఫొటో తీసి ఈ ఆప్ ద్వారా అప్లోడ్ చేస్తే సంబంధిత మున్సిపల్ అధికారులకు సమాచారం నేరుగా వెళ్తుందని ఎస్పీ తెలిపారు. ఆప్ ద్వారా చెత్త సమస్యలను తెలియజేయడం ద్వారా స్వచ్ఛ కర్నూలుకు సహకరించాలని కోరారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి కాలేజ్, ప్రభుత్వ కార్యాలయం, ఎన్జీఓల సహకారంతో ప్రచారం చేస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.