Swachh Bharat Abhiyaan
-
బడ్జెట్ 2020 : ‘జల్ జీవన్ మిషన్‌కు రూ.3.6 లక్షల కోట్లు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ 2020-21లో ఆరోగ్యం, పారిశుద్ధ్య రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గ్రామీణ భారతానికి రక్షిత మంచి నీరు అందించే పథకం ‘జల్ జీవన్ మిషన్’కు పత్యేక ప్రాధాన్యత కల్పించిన కేంద్రం రూ.3.6 లక్షల కోట్లు కేటాయించింది. వ్యవసాయ అనుబంధ రంగాలు, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధికి రూ.2.83 లక్షల కోట్లు కేటాయింపులు చేసింది. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.12,300 కోట్లు కేటాయిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆమె పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. (చదవండి : బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) 20 వేల ఆస్పత్రులను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రైతుల కోసం కిసాన్ రైల్వే-కిసాన్ ఉడాన్ పథకాలను తీసుకొస్తున్నామని చెప్పారు. పళ్లు, పూలు, కూరగాయల ఎగుమతులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ జనరిక్ మందులు లభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టీబీని దేశం నుంచి తరిమి కొట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, దానికోసం విసృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ప్రధాని జన ఆరోగ్య యోజనకు రూ.69 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. -
మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న మోదీ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్‌కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డు వరించింది. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించినందుకు గాను మిలిందా గేట్స్ ఫౌండేషన్ మోదీకి ఈ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘గాంధీ జీ స్వచ్ఛత కల ఈ అవార్డుతో నెరవేరిందని భావిస్తున్నాను. మహాత్మడి 150వ జయంతి జరుపుకోబోతున్న ఏడాదే నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కడికే వచ్చిన అవార్డు కాదు. ఇది నా దేశ ప్రజలందరిది. 130 కోట్ల మంది ప్రజలు ఓ ప్రతిజ్ఞ చేశారంటే.. అది తప్పక నెరవేరుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 3 లక్షల మంది ప్రజలను రోగాల బారి నుంచి కాపాడగల్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గతంలో పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల మన కుమార్తెలు చదువు మధ్యలోనే ఆపేసి.. ఇంటికి పరిమితమయ్యేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చింది’ అన్నారు మోదీ. స్వచ్ఛ సర్వేక్షన్ వల్ల భారతదేశ రాష్ట్రాలు ఇప్పుడు పరిశుభ్రతలో ఉన్నత ర్యాంకు కోసం ఒకదానితో ఒకటి పోటీ పడటం తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మోదీ. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గాంధీ కలలు కన్నా పరిశుభ్ర భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రధాని మోదీ 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడం, గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం. -
మోదీకి మిలిందా గేట్స్ ఫౌండేషన్ అవార్డు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మరో అవార్డు వరించింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన భార్య మిలిందా గేట్స్ ఆధ్వర్యంలో నడిచే 'బిల్ – మిలిందా గేట్స్ ఫౌండేషన్' పురస్కారాన్ని మోదీని అందుకోనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘ప్రధాని మోదీ వినూత్న కార్యక్రమాలు చేపపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పురస్కారాలు ఆయనను వరిస్తున్నాయి. తాజాగా స్వచ్ఛ భారత్ పథకానికిగాను ప్రధానికి బిల్ - మిలిందా గేట్స్ ఫౌండేషన్ పురస్కారం దక్కింది. ఇది ప్రతి భారతీయునికి గర్వకారణం ' అని జితేంద్ర ట్విటర్లో తెలిపారు. ఇటీవలే ప్రధాని మోదీకి యుఏఈ అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ జాయేద్'ను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకమైన స్వచ్ఛ భారత్ పథకాన్ని మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా బిల్ గేట్స్ ప్రశంసించారు. మే 2018లో బిల్ గేట్స్ 'ఆధార్' పథకానికి మద్దతిచ్చారు. Another award,another moment of pride for every Indian, as PM Modi's diligent and innovative initiatives bring laurels from across the world. Sh @narendramodi to receive award from Bill & Melinda Gates Foundation for #SwachhBharatAbhiyaan during his visit to the United States. pic.twitter.com/QlsxOWS6jT — Dr Jitendra Singh (@DrJitendraSingh) September 2, 2019 -
హాస్పిటల్స్ లో 'టాయిలెట్' ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ కు మద్ధతుగా తెరకెక్కించిన బాలీవుడ్ మూవీ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ఘనవిజయం సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. గాంధీ జయంతి రోజున ఈ సినిమాను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మల మూత్ర విసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. అందులో భాగంగానే టాయిలెట్ సినిమాను హాస్పిటల్స్ లో ప్రదర్శించాలని నిర్ణయించారు. అంతేకాదు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న పెద్ద ఎత్తున స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. -
'ఆమెను వెళ్లనివ్వకండి'
లక్ష్మీదేవిని వెళ్లనివ్వకండి,ఇంట్లోనే కొలువై ఉండనివ్వండి..అంటోంది బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. బిగ్ బీ కూడా అదే చెబుతున్నారు. ఇంతకీ లక్ష్మీదేవి ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అసలు కంగనా.. లక్ష్మీదేవి అవతారంలో ఎందకు కనిపిస్తుంది? తెలియాలంటే.. తెలుసుకోవాలి మరి. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు బోలెడంత ప్రచారం కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్, క్వీన్ కంగనాలు 'స్వచ్ఛ్ భారత్'కు ప్రచారకర్తలుగా ఉన్నారు. పరిశుభ్రత ఆవశ్యకతను అర్థమయ్యేలా వివరిస్తూ కంగనా నటించిన 'డోన్ట్ లెట్ హర్ గో' వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. పరిసరాలను పరిశభ్రంగా ఉంచుకోకపోతే మనం ధన దేవతగా కొలిచే 'లక్ష్మీదేవి' మన నుంచి ఎలా వెళ్లిపోతుందనేది వినోదాత్మకంగా చిత్రీకరించారు. 'పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్' విభాగం విడుదల చేసిన ఈ వీడియోలో కంగనా లక్ష్మీదేవిగా కనిపిస్తుంది. రెండున్నర నిముషాల నిడివి గల ఈ వీడియో 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమ లక్ష్యాన్ని, పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తుంది. యూ ట్యూబ్‌లో ఇప్పటికే లక్షమందికిపైగా ఈ వీడియోను వీక్షించారు. మరి మీరూ చూసి.. ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకోండి.