![Narendra Modi Received Goalkeepers Global Goals Award Swachh Bharat - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/25/Modi.jpg.webp?itok=Iy6NDTaG)
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్‌కీపర్స్ గ్లోబల్ గోల్స్ అవార్డు వరించింది. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ప్రారంభించినందుకు గాను మిలిందా గేట్స్ ఫౌండేషన్ మోదీకి ఈ అవార్డు ప్రదానం చేసింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ చేతుల మీదుగా మోదీ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘గాంధీ జీ స్వచ్ఛత కల ఈ అవార్డుతో నెరవేరిందని భావిస్తున్నాను. మహాత్మడి 150వ జయంతి జరుపుకోబోతున్న ఏడాదే నేను ఈ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఒక్కడికే వచ్చిన అవార్డు కాదు. ఇది నా దేశ ప్రజలందరిది. 130 కోట్ల మంది ప్రజలు ఓ ప్రతిజ్ఞ చేశారంటే.. అది తప్పక నెరవేరుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత 3 లక్షల మంది ప్రజలను రోగాల బారి నుంచి కాపాడగల్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గతంలో పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడం వల్ల మన కుమార్తెలు చదువు మధ్యలోనే ఆపేసి.. ఇంటికి పరిమితమయ్యేవారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ పరిస్థితుల్లో మార్పులు తెచ్చింది’ అన్నారు మోదీ.
స్వచ్ఛ సర్వేక్షన్ వల్ల భారతదేశ రాష్ట్రాలు ఇప్పుడు పరిశుభ్రతలో ఉన్నత ర్యాంకు కోసం ఒకదానితో ఒకటి పోటీ పడటం తనకు సంతోషాన్ని కల్గిస్తుందన్నారు మోదీ. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గాంధీ కలలు కన్నా పరిశుభ్ర భారత్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. మహాత్మా గాంధీకి నివాళిగా ప్రధాని మోదీ 2014 అక్టోబర్‌లో స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించారు. ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడం, గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చడం దీని ప్రధాన లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment