కలెక్టరేట్‌ను పరిశుభ్రంగా ఉంచాలి
జాయింట్ కలెక్టర్ బద్రి శ్రీనివాస్
టవర్‌సర్కిల్: మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని..ఇదే స్ఫూర్తితో కరీంనగర్ కలెక్టరేట్‌ను పరిశుభ్రతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని జేసీ బద్రి శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్లో అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛభారత్ నిర్వహించారు. ముందుగా కార్యాలయం ఆవరణలోని గాంధీ విగ్రహం స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ప్రగతికి సోపానాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు నైతిక విలువలు పెంపొందించుకోవాలని కోరారు.
కార్యాలయంలో రికార్డులు క్రమపద్ధతిలో ఉంచుకోవాలని సూచించారు. కార్యాలయాలను దేవాలయాలుగా చూడాలన్నారు. పాత ఫర్నీచర్, పాత రికార్డు తొలగించి, కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇక నుంచి ప్రతినెల మూడో శనివారం ఉదయం 7 గంటలకు స్వచ్ఛభారత్ నిర్వహిస్తామని జేసీ తెలిపారు. డీఆర్వో అయేషామస్రత్‌ఖానమ్, సీపీవో సుబ్బారావు, ఆర్డీవో రాజాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీసీవో ఇంద్రసేనారెడ్డి, కలెక్టరేట్ పాలనాధికారి దిండిగాల రవీందర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.