పాడిని పెంచి...కరువును తరిమి
లాభాల బాటలో ‘మిల్క్’నూర్ స్వకృషి డెయిరీ
రూ. 88కోట్లతో వ్యాపారం
నేడు 14వ మహాసభ
భీమదేవరపల్లి: ఓ వైపు అనావృష్టి వెంటాడగా మరో వైపు అప్పుల బాధ తీవ్రమైంది. గత్యంతరం లేక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న దైనందిన రోజులవి. మెట్ట ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు లేక వర్షాలు సక్రమంగా కురవక గ్రామల ప్రజలు కరువుతో అల్లాడిపోయారు.
కుటుంబాల్లో దర్భర పరిస్థితులు చూసిన మహిళలు మొక్కవోని ధైర్యంతో ముందడుగువేశారు. పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పైసా పైసా కూడబెట్టుకొని సమష్టిగా సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. క్రమక్రమంగా గ్రామాల్లో సంఘాలను విస్తరించుకొని పొదుపు ద్వారా కూడబెట్టుకున్న డబ్బులతోనే ముల్కనూర్ మహిళ స్వకృషి డెయిరీని ఏర్పాటు చేసుకున్నారు. నేడు ఆ డెయిరీ లాభాసాటిగా వ్యాపారం సాగిస్తూ అనేక కుటుంబాలకు పెద్ద దిక్కుగా మారింది. మండలంలో ముల్కనూర్ స్వకృషి స్థాపించి 13 ఏళ్ళు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగిడుతున్న తరుణంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రారంభం...
కరీంనగర్, వరంగల్ జిల్లాలోని 72 గ్రామాల్లో 6 వేల మంది సభ్యులు రూ.7 కోట్లతో మండలంలోని ముల్కనూర్‌లో 2002 ఆగస్టు 17న మహిళ స్వకృషి డెయిరీ ప్రారంభించారు. క్రమంగా వ్యాపారం విస్తరించడంతో ప్రస్తుతం 131 గ్రామాల్లో 21 వేల సభ్యులతో రూ.88 కోట్ల వ్యాపారం చేస్తూ లాభాల బాటలో డెయిరీ పయనిస్తుంది. ప్రతి రోజు సంఘాల నుంచి 45 వేల పై చిలుకు లీటర్ల పాలను సేకరిస్తూ 22 వేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది.
అవినీతికి చెక్...
అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి గ్రామంలోని పాల సంఘాన్ని కంప్యూటరీకరించారు. సంఘానికి, డెయిరీకి కంప్యూటీకరణ ఉండడంతో ప్రతి రోజు ఏ గ్రామం నుంచి ఎన్ని పాలు సేకరించారు అనే విషయం ఆన్లైన్లో తెలుస్తోంది. దీంతో అవినీతికి ఆస్కారం ఉండదు. పాలు సేకరించగానే వెన్న శాతం, డబ్బులు సభ్యురాలి పాసుబుక్కులో నమోదు చేస్తారు. ఫలితంగా ఏ రోజు ఎన్ని డబ్బులు వచ్చాయనే విషయం సభ్యురాలికి తెలుస్తోంది. 15 రోజుల కొకమారు సంఘంలో సభ్యులకు పాల బిల్లును అందిస్తారు.
వైఎస్సార్ సందర్శన
అభివృద్ధి బాటలో నడుస్తోన్న డెయిరీని చూసేందుకు వివిధ దేశాల ప్రతినిధులు ఇక్కడికి వస్తుంటారు. సీఎం హోదాలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2006 మార్చి 18న ముల్కనూర్‌కు వచ్చి ఇక్కడి విషయాలను తెలుసుకుని మహిళలకు కితాబునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ నర్సింహాన్ సైతం డెయిరీని సందర్శించారు. నాణ్యత ప్రమాణాలు పాటించడంతో పాటు సభ్యులకు డెయిరీ అందిస్తున్న సేవలకు గానూ 2012 డిసెంబర్ 6న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా డిల్లీలోఅధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డిలు ఉత్తమ సహాకార సంఘ ఆవార్డును అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు మూడు పర్యాయాలు డెయిరీకి ఐఎస్వో గుర్తింపు లభించింది.
డెయిరీ అందిస్తున్న సేవలు
పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. దాణా, తౌడు, గడ్డి గింజలు, మినలర్ మిక్షర్, వ్యాధినిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణతో పాటు పశుభీమా సౌకర్యాన్ని కూడ డెయిరీ కల్పిస్తుంది. క్షేత్ర స్థాయిలో పాడి పశువుల పెంపకం, ఆహారం, యాంత్రీకరణ అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. సంఘ సభ్యులు, నామినీలు మరణిస్తే కుటుంబాలకు రూ. 2వేల చొప్పున అందిస్తున్నారు
బోనస్ పంపిణీ
ఈ నెల 31న ముల్కనూర్ స్వకృషి డెయిరీలో 14 వ మహాసభ నిర్వహిస్తున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు కడారి పుష్పలీల, జీఎం భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది వ్యాపారం ద్వారా వచ్చిన లాభాల నుంచి రూ. 5.73 కోట్ల బోనస్‌ను సంఘాలకు అందించనున్నారు. పదమూడేళ్ళుగా రూ.20.90 కోట్ల బోనస్‌ను పంపిణీచేశారు. మహాసభకు మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హాజరవుతున్నట్లు వారు తెలిపారు.