swamy aghnivesh
-
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
న్యూఢిల్లీ: సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్(80) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సిర్రోసిస్ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన మంగళవారం నుంచి వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ తెలిపింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో గుండెపోటు వచ్చిందని 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారని పేర్కొంది. తెలుగువారే.. అగ్నివేశ్ మన తెలుగువ్యక్తే. అసలు పేరు వేప శ్యామ్ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలోని ఓ కుగ్రామంలో 1939 సెప్టెంబర్ 21న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్ గ్జేవియర్ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించి ఎనలేని కృషి చేశారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు నాయకులతో చర్చలు జరిపే బాధ్యతని స్వామి అగ్నివేశ్‌కే అప్పగించింది. ఆర్యసమాజ్ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: అగ్నివేశ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడిన స్వామీ చిరస్మరణీయులన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి మొదట్నుంచీ మద్దతుగా నిలిచారన్నారురు. అగ్నివేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిక్కోలు నివాళి శ్రీకాకుళం, సోంపేట: శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన అగ్నివేశ్ తన ప్రస్థానాన్ని జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లగలిగారు. ఆయన కన్నుమూతతో సిక్కోలు నివాళి అర్పించింది. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ప్రధానంగా సోంపేట థర్మల్ ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో అగ్నివేశ్ సోంపేట, బీల ప్రాంత పరిసర గ్రామాల ప్రజలతో మాట్లాడారు. -
స్వామి అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తల దాడి
రాంచీ : సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జార్ఖండ్‌లో మంగళవారం బీజేవైఎం, వీహెచ్‌పీ, ఆరెస్సెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పకూర్ ప్రాంతంలో అగ్నివేష్‌పై దాడికి దిగిన కార్యకర్తలు ఆయనను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు. అగ్నివేష్ రాకను వ్యతిరేకిస్తూ జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారని, ఆయన క్రిస్టియన్ మిషనరీలతో కలిసి జార్ఖండ్‌లో గిరిజనులను వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నట్టు దైనిక్ జాగరణ్ తెలిపింది. అగ్నివేష్ బసచేసిన హోటల్ వద్ద ఉదయం నుంచి వేచిఉన్న బీజేపీ కార్యకర్తలు ఆయన బయటకు రాగానే ఒక్క ఉదుటున దాడికి తెగబడ్డారు. బీఫ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. కాగా, అగ్నివేష్ గతంలో హర్యానాలో ఎమ్మెల్యేగా వ్యవహరించడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలగే ముందు మంత్రి పదవినీ నిర్వహించారు. అన్నా హజారే నేతృత్వంలో అవినీతి వ్యతిరేక పోరాటంలో అగ్నివేష్ చురుకుగా పాల్గొన్నారు. -
ఫిల్మ్‌సిటీతో ఆత్మహత్యలు ఆగుతాయా?
* రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు అగ్నివేశ్ సూటి ప్రశ్న * తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో ప్రారంభోపన్యాసం * మంత్రుల పిల్లలు ప్రభుత్వస్కూళ్లలో చదివితేనే సామాజిక క్రాంతి * వితంతు పింఛన్లను వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త, మానవహక్కుల నేత స్వామి అగ్నివేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫిల్మ్‌సిటీ వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు ఆత్మహత్యలు కొనసాగుతుంటే వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. శని వారం ఇక్కడ జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలో అగ్నివేశ్ ప్రారంభోపన్యాసం చేస్తూ వివిధ అంశాలపై మాట్లాడారు. సీఎం, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, టీచర్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటేనే విద్య, వైద్య రంగాల్లో మార్పు, సామాజిక క్రాంతి వస్తుందని అగ్నివేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛనును రూ. వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, భవిష్యత్తులో ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన అభినందించారు. నవ భారతావని కలలను మోసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్‌లో దేశానికే ఆదర్శం కాగల సత్తా ఉందన్నారు. తెలంగాణ సాధనలో పాత్ర పోషించినా అధికారం కోరుకోకుండా వేదిక నాయకులు ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా వ్యవహరించాలనుకోవడం గొప్ప విషయమన్నారు. అంధ విశ్వాసాల నుంచి బయటపడాలనే సందేశంతో రూపొందిన ‘పీకే’ వంటి చిత్రాలు తెలుగు, ఇతర భాషల్లోనూ రావాలని అగ్నివేశ్ ఆకాంక్షించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వా త తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు, ప్రజాసంఘంగా లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు వేదిక సమావేశమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగవుతాయన్న ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు కృషి జరగాలని విద్యావేత్త చుక్కారామయ్య పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర సాధన తర్వాత ‘ప్రజాస్వామ్యం కోసం-పాలనలో, పైసాలో భాగం’ అనే నినాదంతో వేదిక ముందుకు వెళ్తోందన్నారు. ఈ సభలో ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, రమా మెల్కోటే, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీడీఎఫ్ నేత డీపీరెడ్డి, జేఏసీ నేతలు రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, రఘు, మామిడి నారాయణ, భిక్షపతి, కె.గోవర్ధన్, సంధ్య, గులిజాల రవీందర్రావు, వెంకటేశం పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో మార్పులు కావాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ చట్టంలోని లొసుగులను తొల గించాలని కోరుతూ మహాసభ తీర్మానం చేయాలని కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతల అజమాయిషీపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండటం సరికాదన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధన లేదన్నారు. విద్యావంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: కె. రామచంద్రమూర్తి ప్రభుత్వంతో కరచాలనం చేయడంతోపాటు అవసరమైతే కరవాలచలనం చేసేందుకు కూడా విద్యావంతులు సిద్ధంగా ఉండాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, మంచిచేస్తే అభినందించాలన్నారు. తెలంగాణ ‘తెహజీబ్’ అయిన గంగా జమున సంస్కృతిని (సర్వమత సామరస్యం) పరిరక్షించేందుకు, అసమానతలు, పేదరికం, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా రూపుదిద్దేందుకు కృషిచేయాలన్నారు.