ఫిల్మ్‌సిటీతో ఆత్మహత్యలు ఆగుతాయా?
* రైతు ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్‌కు అగ్నివేశ్ సూటి ప్రశ్న
* తెలంగాణ విద్యావంతుల వేదిక మహాసభలో ప్రారంభోపన్యాసం
* మంత్రుల పిల్లలు ప్రభుత్వస్కూళ్లలో చదివితేనే సామాజిక క్రాంతి
* వితంతు పింఛన్లను వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రముఖ సామాజిక ఉద్యమకర్త, మానవహక్కుల నేత స్వామి అగ్నివేశ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ స్థాయిలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫిల్మ్‌సిటీ వల్ల రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయా? అని సూటిగా ప్రశ్నించారు. ఒకవైపు ఆత్మహత్యలు కొనసాగుతుంటే వేల ఎకరాల్లో ఫిల్మ్‌సిటీని నిర్మించాల్సిన అవసరం ఏముందన్నారు. శని వారం ఇక్కడ జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక 5వ రాష్ట్ర మహాసభలో అగ్నివేశ్ ప్రారంభోపన్యాసం చేస్తూ వివిధ అంశాలపై మాట్లాడారు.
సీఎం, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, టీచర్ల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటేనే విద్య, వైద్య రంగాల్లో మార్పు, సామాజిక క్రాంతి వస్తుందని అగ్నివేశ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛనును రూ. వెయ్యికి పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, భవిష్యత్తులో ఆ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆయన అభినందించారు. నవ భారతావని కలలను మోసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్‌లో దేశానికే ఆదర్శం కాగల సత్తా ఉందన్నారు. తెలంగాణ సాధనలో పాత్ర పోషించినా అధికారం కోరుకోకుండా వేదిక నాయకులు ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా వ్యవహరించాలనుకోవడం గొప్ప విషయమన్నారు.
అంధ విశ్వాసాల నుంచి బయటపడాలనే సందేశంతో రూపొందిన ‘పీకే’ వంటి చిత్రాలు తెలుగు, ఇతర భాషల్లోనూ రావాలని అగ్నివేశ్ ఆకాంక్షించారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రసంగిస్తూ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వా త తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు, ప్రజాసంఘంగా లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు వేదిక సమావేశమైందన్నారు. తెలంగాణ ఏర్పడితే బతుకులు బాగవుతాయన్న ప్రజల ఆకాంక్షలను సాధించేందుకు కృషి జరగాలని విద్యావేత్త చుక్కారామయ్య పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర సాధన తర్వాత ‘ప్రజాస్వామ్యం కోసం-పాలనలో, పైసాలో భాగం’ అనే నినాదంతో వేదిక ముందుకు వెళ్తోందన్నారు. ఈ సభలో ప్రొఫెసర్లు కేశవరావు జాదవ్, రమా మెల్కోటే, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీడీఎఫ్ నేత డీపీరెడ్డి, జేఏసీ నేతలు రాజేందర్‌రెడ్డి, ప్రహ్లాద్, రఘు, మామిడి నారాయణ, భిక్షపతి, కె.గోవర్ధన్, సంధ్య, గులిజాల రవీందర్‌రావు, వెంకటేశం పాల్గొన్నారు.
పునర్విభజన చట్టంలో మార్పులు కావాలి: జస్టిస్ సుదర్శన్‌రెడ్డి
రాష్ట్ర పునర్విభజన చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ చట్టంలోని లొసుగులను తొల గించాలని కోరుతూ మహాసభ తీర్మానం చేయాలని కోరారు. హైదరాబాద్ శాంతిభద్రతల అజమాయిషీపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండటం సరికాదన్నారు. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధన లేదన్నారు.
విద్యావంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: కె. రామచంద్రమూర్తి
ప్రభుత్వంతో కరచాలనం చేయడంతోపాటు అవసరమైతే కరవాలచలనం చేసేందుకు కూడా విద్యావంతులు సిద్ధంగా ఉండాలని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరిగేందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, మంచిచేస్తే అభినందించాలన్నారు. తెలంగాణ ‘తెహజీబ్’ అయిన గంగా జమున సంస్కృతిని (సర్వమత సామరస్యం) పరిరక్షించేందుకు, అసమానతలు, పేదరికం, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా రూపుదిద్దేందుకు కృషిచేయాలన్నారు.