మతానికి, ధర్మానికి తేడా గుర్తించండి: స్వరూపానంద
మతానికి, ధర్మానికి మధ్య గల తేడాను గుర్తించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రజలకు చెప్పారు. 'మాండూక్య అద్వైత స్వరూపం వేదాంత గ్రంథరాజం' పుస్తకాన్ని ఆయన చందానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ధర్మం మతం కంటే పెద్దదని, ఈ పుస్తకం ఆ విషయాన్నే వివరిస్తుందని ఆయన తెలిపారు. ''మాండూక్య అద్వైతం ధర్మం గురించి మాత్రమే చెబుతుంది. ధర్మసూక్ష్మాలను ఈ పుస్తకం ద్వారా ప్రజలకు వివరించి, వాళ్లకు విశదపరిచేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుందనే భావిస్తున్నాను. దైవిక జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది'' అని స్వామి చెప్పారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఈ పుస్తకరాజాన్ని ఆవిష్కరించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వివిధ సందర్భాల్లో తన శిష్యులకు చేసిన ప్రబోధాలతో ఈ మహాగ్రంథాన్ని రూపొందించారు. ఈ గ్రంథానికి తుదిరూపు ఇచ్చేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఈ గ్రంథాన్ని చాగంటి ప్రకాశరావు కూర్చారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడులపై ఈ సందర్భంగా స్వామి స్వరూపానంద ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని అనుసరించడం ద్వారా ఈ మతమార్పిడులను అత్యవసరంగా ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమానత్వం, సత్యం గురించి మాట్లాడే సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. జగద్గురు శంకరాచార్య బోధించిన పది ఉపనిషత్తుల్లో అత్యంత ప్రముఖమైనది ఈ మాండూక్యోపనిషత్తు అని స్వరూపానంద తెలిపారు. ఉపనిషత్తులు, వేదాలు కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమని కొందరు అనుకుంటారు గానీ అది తప్పని చెప్పారు. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినవారు తప్పనిసరిగా ఈ మహాగ్రంథాన్ని చదివి, అర్థం చేసుకోవాలని.. ఇది దైవిక ఆలోచనలకు మార్గం చూపుతుందని అన్నారు. ఎవరైనా ముక్తి కావాలనుకుంటే.. ఈ మహాగ్రంథాన్ని చదివితే సరిపోతుందన్నారు.
సనాతన ధర్మాన్ని ఒక్కతాటి మీదకు తేవడంలో స్వామి స్వరూపానంద సేవలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రస్తుతించారు. మాండూక్య అద్వైతోపనిషత్తు సారాన్ని పైకి తేవడంలో స్వామి చేసిన ప్రయత్నాలను పలువురు వేద పండితులు తన దృష్టికి తెచ్చారన్నారు. తాను టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో స్వామి సూచనలను ఎలా అమలుచేసినదీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గుర్తుచేసుకున్నారు. వేదాలు ధర్మసారాన్ని వివరిస్తాయి కాబట్టి వాటిని అనుసరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం చెప్పారు. ఈ వేదికపై ఆంధ్రా వేదపండితుడు సుబ్రహ్మణ్య దీక్షితులు, కర్ణాటక వేదపండితుడు అశ్వత్థనారాయణ అవధాని, అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌లను స్వామి సన్మానించారు.