జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్టులు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
నెల్లూరు, సిటీ : జిల్లాలో 11 టూరిజం ప్రాజెక్ట్‌లతో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ల నిర్మాణాన్ని గురువారం తెల్లవారుజామున ఆయన పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ రొట్టెల పండుగకు దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు వస్తుంటారన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గోదావరి, కృష్ణా పుష్కరాలకు చేసిన ఏర్పాట్లును రొట్టెల పండుగకు కూడా చేస్తామన్నారు. జిల్లాకు రూ.60.37 కోట్లు స్వదేశీ దర్శన్‌లో భాగంగా కేటాయించడం జరిగిందన్నారు. అందులో రూ.2.62 కోట్లు స్వర్ణాల చెరువు కోసం కేటాయించారని చెప్పారు. అక్టోబర్ 8వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించినట్లు చెప్పారు. ఆయన వెంట నగర మేయర్ అజీజ్, టీడీపీ నగర ఇన్చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు పాల్గొన్నారు.