సర్వరోగ నివారిణి ఆయుర్వేదం
విజయవాడ(లబ్బీపేట) ఆయుర్వేదం సర్వరోగ నివారిణి అని, రాష్ట్రంలో ఆయుర్వేద వైద్యం, వైద్య విద్య అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ ఎగ్జిక్యూటీవ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ మిడ్‌సిటీలో సురక్ష,సుఖాయు ఆధ్వర్యంలో ఆదివారం ధన్వంతరి జయంతి వేడుకలు నిర్వహించారు. వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ధన్వంతరి అవార్డులను అందచేసి సత్కరించారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్ మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉందన్నారు. అతి పురాతమైన ఆయుర్వేద వైద్య విధానం తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి నగరంలో ఆయుర్వేద వైద్య విద్యాలయాల స్థాపనకు తనవంతు కృషి చేస్తానన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆయుర్వేద వైద్య విద్యను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇఎస్ఐ హాస్పటల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ప్రొఫెసర్ వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఇఎస్ఐలో ఆయుర్వేద డిస్పెన్సరీ, పడకలు ఏర్పాటు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ సభ్యులు డాక్టర్ ఎంఎల్ నాయుడు, డాక్టర్ జీవీ పూర్ణచంద్, పి మురళీకృష్ణ తదితరుల పాల్గొన్నారు. డాక్టర్ సీఎల్ వెంకట్రావ్‌కు లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డును అందచేయగా, డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ ఎంఎల్ నాయుడు, డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తదితరులకు ధన్వంతరి అవార్డులు అందచేశారు.