Swatchha bharat
-
నిర్భయంగా కూర్చునే ధీమా
ఆ చిన్ననాటి రోజులు ఎంత మంచివి! ఒంటికి వెళ్లాల్సి వస్తే ఒక వేలు.. మరో అవసరం కోసం రెండు వేళ్లూ చూపించినంత చలాకీగా హాయిగా గడిచిపోయేది జీవితం. పెరిగి పెద్దవ్వడం, పెద్దయినందుకు గుర్తుగా సంస్కారం నేర్చుకోవడం ఎంత పెద్ద పనిష్మెంట్? అది అప్పుడర్థం కాదు. అర్థమయ్యేసరికి బాల్యం ఉండదు. బాల్యం నాటి ఆ సౌఖ్యం ఉండదు. మనిషై పుట్టాక ఎన్నో కష్టాలు. మరెన్నో సమస్యలు. గోడలే లేని జలాశయానికి సంస్కారపు లాకులూ, సంకల్పపు గేట్లను అడ్డుపెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పొత్తికడుపు వెనక అవయవాలెన్నో ముంపుగ్రామాల్లా మునిగిపోతున్న భావన. కడుపునొప్పి మూడో నెంబరు ప్రమాద సూచికను ఎగరేసిన ఫీలింగ్. ఇక సమస్య ఆ రెండోదైతే పదిమందీ పకపకలాడతారేమోనని పడే పడరాని మనోవేదన రెట్టింపవుతుంది. కాసేపట్లో తీరబోయే తాత్కాలిక సమస్యే అయినా తీరం దాటబోయే ముందు తుఫాను సృష్టించే కలవరం కలిగిస్తుంది. బరువు దించుకునేంత వరకు బండ మోస్తున్న భావన. అదే శాశ్వతమేమో అన్న యోచన. అంతులేనంత ఆందోళన. బ్రెయిన్ మీద ఒత్తిడిని ఎంతైనా భరించవచ్చు. కష్టమైనా సరే రోజులూ, నెలలు అవసరాన్ని బట్టి ఏళ్లూ పూళ్లూ ఓపిక పట్టవచ్చు. కానీ బ్లాడర్ మీద ప్రెషర్నీ, స్ఫింక్టర్ మీద స్ట్రెస్నీ భరించడం ఎంత కష్టం. ఎంతగా ఓపిక పట్టినా ఒక్కోసారి నలుగురిలో నగుబాటు! ఎంతటి ఎంబరాసింగ్ సిచ్యువేషన్!! బ్లాడర్లూ, బవెల్సూ మీద ఒత్తిడిలేని లోకం... ఆ స్ట్రెస్‌నూ, ఆ ప్రెషర్‌నూ ఎక్కడైనా నిస్సంకోచంగా దించుకునే ప్రపంచం ఎక్కడుందో... అదే నిజమైన స్వర్గం. బరువు దించుకోవడమే సమస్య. కానీ ఆ బరువు పెంచే అంశాలెన్నో! ఆ అవసరాన్ని రగిలించే అనారోగ్యాలెన్నో. ఒకరికి డయాబెటిస్... మరొకరికి స్ట్రెస్... ఒక బంగారుతల్లికి యూరినరీ ఇన్‌కాంటినెన్స్. కారణమేదైనా మాటిమాటికీ మూత్రవిసర్జనకు వెళ్లాలనిపిస్తుంటుంది. వెళ్లడం తప్పనిసరి అవుతుంది. కొలీగ్స్ ముందు లేవాల్సిరావడం ఒక అన్విల్లింగ్నెస్. లేవకపోతే మరో రకం రిలక్టెన్స్. మీటింగ్‌లో ఉన్నప్పుడు బలంగా మనల్ని పిలిచిన ఓ నేచురల్ కాల్... మనకు మనం విధించుకున్న ఆంక్షతో మెలికలు తిప్పి కలకలం పుట్టిస్తుంది. ఆ కాంక్ష తాలూకు ఆకాంక్ష మన ఆంక్షతో పెద్దశిక్షగా పరిణమించి మన సహనానికి పరీక్ష పెడుతుంది. పురుషాధిక్య సమాజంలోని పురుషుల మనసుల్లోనే ఇంతటి వేదన ఉంది. కానీ దైన్యం కట్టలు తెంచుకొన్నప్పుడు ధైర్యం పుంజుకొనేందుకు తెచ్చిపెట్టుకున్న ఓ అనధికార లైసెన్స్ ఉంది. నాకేమనే తలంపు తలెత్తుతుంది. మగాడిననే భావన తలకెక్కుతుంది. అలా వాడికి నలుగురిలోనైనా గోడవారగా తిరిగే అవకాశం ఉంది. కానీ మహిళలకో? పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టే ప్రభుత్వాలు అంతకుముందే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయమిది. గొప్ప గొప్ప వాగ్దానాలు చేసే నాయకులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. స్వచ్ఛ భారత్‌ల కోసం సెస్‌లు విధించడం కాదు... కాళ్ల దగ్గర నీళ్లచెంబుతో బెంగపడే స్త్రీలూ, రైలు పట్టాల దగ్గర ముఖాలు దాచుకునే మహిళలూ, తుమ్మచెట్ల డొంకదారుల్లో ఎవరో వస్తున్నారంటూ ముఖం ఆ వైపుకు తిప్పుకొని లేచి నిలబడే గ్రామీణులకు నిర్భయంగా కూర్చుండే ధీమా ఇవ్వగలిగితే... వీధుల్లో ఎవరెలా తిరిగినా తమదైన ప్రైవేటు స్థలంలో కూర్చుండిపోయేలా చేయగలిగితే... అదే కోటానుకోట్ల స్వచ్ఛభారత్ ప్రాజెక్టుల సమానం. ఆనాడే స్వాస్థ్య భారత్ ప్రాజెక్టు విజయవంతం. ఆనాడే మన పురుషులైనా, మహిళలైనా ముఖం దించుకుపోకుండా, మెడలు వంచుకుపోకుండా నిటారుగా ఠీవిగా నించోగలరు. తెల్లారితే ఎలాగో అనే ఆందోళన లేకుండా కంటికి నిండైన నిద్రతో పడుకోగలరు. – యాసీన్ -
స్వచ్ఛతలో 195వ స్థానం
► 2017 స్వచ్ఛ్ సర్వేక్షన్ ప్రకటించిన ప్రభుత్వం ► దేశంలో 434 పట్టణాలకు ర్యాంకులు ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణాలకు ర్యాంకులను విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత ఆధారంగా దేశంలోని 434 నగరాల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం కింద ఈ జాబితాను విడుదల చేసింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 37 లక్షల మంది పౌరుల అభిప్రాయాలు సేకరించింది. ర్యాంకులను ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో ఆదిలాబాద్ పట్టణానికి 195వ స్థానం లభించింది. సిటీ స్కోర్‌గా 1006, మున్సిపాలిటీ సెల్ఫ్ డిక్లరేషన్ 366 స్కోర్ సాధించింది. జిల్లాల విభజన తర్వాత నాలుగు జిల్లాలుగా ఆదిలాబాద్ విడిపోవడంతో జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఒక్కటే మిగిలింది. గతంతో పోలిస్తే పట్టణంలో డోర్ టు డోర్ చెత్త సేకరించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం, మురికి కాలువల ఏర్పాటుతో పారిశుధ్యం అంత చెత్తగా లేదనే చెప్పవచ్చు. ఇప్పటికే అమృత్ పథకం కింద ఎంపికైన ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు పాలకులు, అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 8వ స్థానం.. దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బోపాల్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. తొలి 50 ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ స్థానం, వరంగల్ కార్పొరేషన్ 28వ, సూర్యపేట 30, సిద్దిపేట 45 పట్టణాలు ర్యాంకులు సాధించాయి. నిజామాబాద్ 178, మిర్యాలగూడ 182, రామగుండం 191 ఇలా ఏడు పట్టణాల తర్వాతి స్థానంలో ఆదిలాబాద్‌కు 195వ ర్యాంకులో నిలిచి పర్వాలేదనిపిస్తోంది. ఆదిలాబాద్ తర్వాత నల్గొండ 200, కరీంనగర్ 201, ఖమ్మం 236, మహబూబ్‌నగర్ 249వ స్థానంలో నిలిచాయి. కాగా పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో మురికి వాడలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలను చైతన్యం చేసి స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తే మరింత మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. -
రెండేళ్లు పూర్తి చేసుకుంది