
స్వచ్ఛతలో 195వ స్థానం
► 2017 స్వచ్ఛ్ సర్వేక్షన్ ప్రకటించిన ప్రభుత్వం
► దేశంలో 434 పట్టణాలకు ర్యాంకులు
ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణాలకు ర్యాంకులను విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత ఆధారంగా దేశంలోని 434 నగరాల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం కింద ఈ జాబితాను విడుదల చేసింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 37 లక్షల మంది పౌరుల అభిప్రాయాలు సేకరించింది. ర్యాంకులను ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో ఆదిలాబాద్ పట్టణానికి 195వ స్థానం లభించింది.
సిటీ స్కోర్‌గా 1006, మున్సిపాలిటీ సెల్ఫ్ డిక్లరేషన్ 366 స్కోర్ సాధించింది. జిల్లాల విభజన తర్వాత నాలుగు జిల్లాలుగా ఆదిలాబాద్ విడిపోవడంతో జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఒక్కటే మిగిలింది. గతంతో పోలిస్తే పట్టణంలో డోర్ టు డోర్ చెత్త సేకరించడం, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం, మురికి కాలువల ఏర్పాటుతో పారిశుధ్యం అంత చెత్తగా లేదనే చెప్పవచ్చు. ఇప్పటికే అమృత్ పథకం కింద ఎంపికైన ఆదిలాబాద్ పట్టణం కేంద్రం నిధులతో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. భవిష్యత్తులో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు పాలకులు, అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది.
రాష్ట్రంలో 8వ స్థానం..
దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, బోపాల్ మొదటి రెండు స్థానాల్లో నిలువగా.. తొలి 50 ర్యాంకుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ స్థానం, వరంగల్ కార్పొరేషన్ 28వ, సూర్యపేట 30, సిద్దిపేట 45 పట్టణాలు ర్యాంకులు సాధించాయి. నిజామాబాద్ 178, మిర్యాలగూడ 182, రామగుండం 191 ఇలా ఏడు పట్టణాల తర్వాతి స్థానంలో ఆదిలాబాద్‌కు 195వ ర్యాంకులో నిలిచి పర్వాలేదనిపిస్తోంది.
ఆదిలాబాద్ తర్వాత నల్గొండ 200, కరీంనగర్ 201, ఖమ్మం 236, మహబూబ్‌నగర్ 249వ స్థానంలో నిలిచాయి. కాగా పట్టణంలో ఉన్న 36 వార్డుల్లో మురికి వాడలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలను చైతన్యం చేసి స్వచ్ఛభారత్‌పై అవగాహన కల్పిస్తే మరింత మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది.