ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నారు
గోవా సామాజిక వేత్త స్వాతి కేర్కర్
హైదరాబాద్: దేశంలో అన్ని ప్రభుత్వాలు ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నాయని గోవా సామాజిక వేత్త స్వాతి కేర్కర్ అన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ యోధులు బిస్మార్క్ స్మృతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతి కేర్కర్ మాట్లాడుతూ గోవాలో సెజ్‌ల పేరుతో ప్రజలను కొల్లకొట్టాలని చూశారని, ప్రజలు మేల్కొని ఈ సెజ్‌లు ఒక స్కామ్ అని తెలుసుకొని ఎదిరించారన్నారు. కోర్టు కూడా ఈ సెజ్‌లను వ్యతిరేకించిందని అన్నారు. బిస్మార్క్లాగా అక్కడ ప్రతి ఒక్కరూ ఉద్యమించారన్నారు. గోవా చూడటానికి ఎంత అందంగా, ప్రశాంతంగా ఉంటుందో... అదే విధంగా ప్రతి గ్రామంలో ఉద్యమకారులు ఉన్నారని అన్నారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ బిస్మార్క్ మరణం ఒక పెద్ద ప్రశ్నను సమాజం ముందు పెట్టిందని అన్నారు. శాంతియుతంగా ప్రజల కోసం పోరాడిన అహింసావాదిని చంపడం హేయమైన చర్య అన్నారు. ఇసుక, కిరోసిన్ మాఫియాలు ఐఏఎస్, ఐపీఎస్‌లను సైతం చంపుతున్నాయని అన్నారు. 16 నెలల మోదీ పాలనలో ఏ ఒక్క సమస్య సాధారణ ప్రజలకు సంబంధించింది కాదని ఆయన విమర్శించారు. ప్రజా ఉద్యమాల సంఘీభావ కమిటీ నాయకురాలు హేమా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ సూరెపల్లి సుజాత, కవయిత్రి విమల, మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్‌కుమార్ , సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్, వి. సంధ్య, వై. నాగేశ్వర్రావు, కొండవీటి సత్యవతి, మాస్టార్జీ, ఫాదర్ బోస్కో, సిస్టర్ లిజీ తదితరులు పాల్గొన్నారు.