స్వాతి హత్య ఫుట్‌బాల్ క్రీడాకారుల పనేనా?
- భద్రాచలం ఫుట్‌బాల్ జట్టుపై అనుమానాలు
- గుట్టుగా విచారణ జరుపుతున్న పోలీసులు
హుజూరాబాద్ : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలోని తరగతి గదుల్లో చదువుకోవాల్సిన దారం స్వాతి అనే విద్యార్థిని హుజూరాబాద్‌లోని చెట్లపొదల్లో హత్యకు గురికావడంపై కొత్తకొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. పైగా హత్యకు ముందు లైంగికదాడికి గురికావడంతో ఈ ఉదంతం వెనుక ఒకరికంటే ఎక్కువ మందే ఉన్నట్లు పోలీసులు భావించి ఆ దిశలో విచారణ జరుపగా కీలక ఆధారాలు బయటపడ్డట్లు తెలిసింది.
ఈ నెల 14న హుజూరాబాద్‌లోని సబ్‌రిజిస్టార్ కార్యాలయం సమీపంలో వరంగల్ జిల్లా కొత్తగూడ మండలం బావురుకొండకు చెందిన దారం స్వాతి అనే నర్సింగ్ విద్యార్థిని మృతదేహం కనిపించిన విషయం విదితమే. ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించగా రెండు రోజుల్లో ఆమె పర్సులో లభించిన పాస్‌ఫొటోల ఆధారంగా పసిగట్టారు. అయితే భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి హుజూరాబాద్‌కు ఎందుకు వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? హుజూరాబాద్‌తో ఆమెకున్న సంబంధమేమిటి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీయగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మరి ఎందుకు హుజూరాబాద్‌కు వచ్చిందనే కోణంలో క్షేత్రస్థాయిలో విచారణ జరపగా కీలకమైన కోణం బయటపడింది.
హుజూరాబాద్‌లో భద్రాచలం క్రీడాకారులు
ఈ నెల 12,13,14 తేదీల్లో హుజూరాబాద్‌లోని హైస్కూల్ మైదానంలో తెలంగాణ స్థాయి ఫుట్‌బాల్ పోటీలు జరిగాయి. 12న సాయంత్రం ఇక్కడకు భద్రాచలం ఫుట్‌బాల్ జట్టు క్రీడాకారులు వచ్చారు. 13న ఉదయం 11.30 గంటలకు స్వాతి కూడా హుజూరాబాద్‌కు వచ్చినట్లు ఆమె పర్సులో లభ్యమైన బస్‌టికెట్ ద్వారా తెలుస్తోంది. 13న ఉదయం భద్రాచలం జట్టు ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో తిరుగుపయనమయ్యారు. ఇదేరోజు సాయంత్రం స్వాతి హత్యకు గురికావడంతో ఈ హత్యోదంతానికి, ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఏమైనా సంబంధం ఉందా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. పైగా ఆమె హత్యకు గురైన స్థలం వైపు అదేరోజు ఒక కారు వెళ్లినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
భద్రాచలం జట్టు కు ఇక్కడి టోర్నమెంట్ నిర్వాహకులు సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. మరి వారు ఇంతదూరం రావడం వెనుక స్వాతి ఉదంతం కూడా కారణం కావచ్చునేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నారుు. స్వాతికి చెందిన బ్యాగ్ ఖమ్మం జిల్లా కొత్తగూడెం బస్టాండ్‌లో ఉండటం, ఇంట్లో నుంచి ఏ దుస్తుల మీద ఆమె బయటకు వచ్చిందో అదే డ్రెస్సులో హత్యకు గురికావడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ స్వాతిని భద్రాచలం నుంచి కిడ్నాప్ చేసుకొని ఇక్కడకు తీసుకొచ్చి లైంగికదాడి చేసి, హత్యచేయొచ్చని, అనుమానం రాకుండా కరీంనగర్ నుంచి హుజూరాబాద్‌కు వచ్చినట్లు బస్ టికెట్‌ను తన పర్సులో పెట్టొచ్చనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇదే నిజమైతే మరో రెండ్రోజుల్లో పూర్తి విషయాలు బయటపడే అవకాశముంది.