సెన్సెక్స్ 271 పాయింట్ల ర్యాలీ
⇒ రష్యా,ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం
⇒ 8,700 పాయింట్లు దాటేసిన నిఫ్టీ
మార్కెట్ అప్డేట్
రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ట్రేడింగ్ చివరి గంటలో కొనుగోళ్ల జోరు కారణంగా స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లోనే ముగిశాయి. ఢిల్లీలో ఓడిపోవడం వల్ల సంస్కరణల వేగాన్ని తగ్గించబోమని ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడం, స్వీడన్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం కూడా ప్రభావం చూపాయి. మొత్తం మీద బీఎస్ఈ సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడి 28,805 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 8,712 పాయింట్ల వద్ద ముగిశాయి. ఒక్క ఎఫ్ఎంసీజీ రంగం మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్తు, ఐటీ, రంగాల షేర్ల నేతృత్వంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి.
400 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్
సెన్సెక్స్ 28,650 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 400 పాయింట్ల రేంజ్లో కదలాడింది. 29,839-28,406 పాయింట్ల గరిష్ట-కనిష్ట స్థాయిల మధ్య ట్రేడైన సెన్సెక్స్ చివరకు 271 పాయింట్ల లాభంతో 28,805 పాయింట్ల వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 578పాయింట్లు లాభపడింది. మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడనున్న పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల ద్రవ్యోల్బణం గణాంకాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో కొనుగోళ్ల జోరు పెరిగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు.
30 షేర్ల సెన్సెక్స్‌లో 23 షేర్లు లాభాల్లో ముగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 5.4%, భెల్ 4.9%, సిప్లా 4%, గెయిల్ ఇండియా 3.2%, మారుతీ సుజుకీ 2.5%, సెసా స్టెరిలైట్ 2%, ఎల్ అండ్ టీ 2%, టాటా పవర్ 1.9%, హీరో మోటొకార్ప్ 1.9%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.8%, యాక్సిస్ బ్యాంక్ 1.6%, ఎన్టీపీసీ 1.6%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.3%, ఇన్ఫోసిస్ 1.2%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1%, విప్రో 1% చొప్పున పెరిగాయి.