ముగ్గురూ ముగ్గురే!
ఆ ముగ్గురూ ముగ్గురే. ఒకే రక్తం పంచుకుని పుట్టిన ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఐక్యూ కూడా ఒకటే రేంజ్లో ఉంది. అందుకే చదువుల్లో అదరగొడుతూ.. ఎంబీబీఎస్ చేరిన ఈ ముగ్గురు ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా ప్రత్యక్షమవుతారు. ఎలాంటి ప్రశ్నలకైనా తడుముకోకుండా సమాధానం చెప్పి కప్పు కొట్టేస్తారు. సిటీకి చెందిన ముస్తఫా హస్మీ, ముర్తుజా హస్మీ, అస్నా హస్మీ హైదరాబాద్‌లోని ముఫఖంజా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం జరిగిన ‘స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ క్విజ్-2014’లో విజేతలుగా నిలిచారు. న్యూఢిల్లీలో నవంబర్ ఒకటిన జరిగే జాతీయ క్విజ్ పోటీలకు హైదరాబాద్ నుంచి పోటీపడేందుకు అర్హత సాధించారు.
ఈ ముగ్గురిలో ముస్తఫా హస్మీ పెద్దవాడు. ఎనిమిదో తరగతి వరకు దుబాయ్, సౌదీ, హైదరాబాద్‌లో చదివిన ముస్తఫా.. తర్వాత హైదరాబాద్‌లో చదివాడు. ప్రస్తుతం ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఎల్కేజీలో ఉన్నప్పుడే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో గాంధీజీ వస్త్రధారణతో ముస్తఫా తొలి బహుమతి పొందాడు. ఆ స్ఫూర్తితో అన్నిరకాల పోటీల్లో గెలుస్తూ వచ్చాడు. 2007 ‘అక్వారిజియా క్విజ్’లో రెండో స్థానం సాధించి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ బయోలజీ ఒలింపియాడ్‌లో రజిత పతకం పొందాడు. 2010 ఎంసెట్ మెడిసిన్‌లో ముస్తఫా పదోర్యాంక్ సాధించాడు. 2012లో అమితాబ్‌బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ -6’లో 50 లక్షల ప్రశ్న వరకు వెళ్లిన ముస్తఫా చిన్న తప్పిదంతో రూ.80 వేలతో సరిపెట్టుకున్నాడు. గతేడాది ముంబైలో జరిగిన ‘టాటా ఫినాన్స్ క్విజ్’లో విజేతగా నిలిచాడు. గత ఫిబ్రవరిలో ఎన్డీటీవీ టెక్ గ్రాండ్ మాస్టర్స్ క్విజ్‌లో విన్నయ్యాడు.
అన్న బాటలో తమ్ముడు, చెల్లి..
ముస్తఫా సోదరుడు ముర్తుజా హస్మీ, సోదరి అస్నా హస్మీలు కూడా ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు కూడా పలు జనరల్ నాలెడ్జ్, ఉపన్యాస, వక్తృత ్వ పోటీల్లో గెలుపొందారు. ఈ నెల 8న కౌన్ బనేగా కరోడ్‌పతిలో ముర్తుజా పాల్గొన్నాడు. 2012లో లిమ్కా బుక్ నిర్వహించిన నేషనల్ క్విజ్ విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. అస్నా హస్మీ స్వీడన్ ఇండియా నోబెల్ మెమోరియల్ క్విజ్‌లో విజయం సాధించింది.
పేరెంట్స్ ప్రోత్సాహం..
‘నాన్న ఖాలీద్ హస్మీ.. కిర్బి కంపెనీ వైస్ ప్రెసిడెంట్, అమ్మ అసీమున్నీస ఎమ్మెస్సీ, బీఈడీ చేసింది. మేము అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని వాళ్లు ప్రోత్సహించారు. ఎక్కడ క్విజ్ పోటీలు జరిగినా తీసుకెళ్లేవారు. మేం వైద్యులు కావాలన్నమా కన్నవారి కలలను నిజం చేస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక సామాజిక సేవ చేయాలనుకుంటున్నాం. నవంబర్ 1న న్యూఢిల్లీలో జరిగే జాతీయ క్విజ్ పోటీల్లో విజయం సాధించి.. స్వీడన్లో వారం రోజులు పర్యటించే చాన్స్ దక్కించుకుంటాం’ అని అంటున్నారు ఈ ముగ్గురు.
ఇంటర్నెట్ సపోర్ట్..
పుస్తకాలు, దినపత్రికలతో పాటు ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటామని చెబుతున్నారు. అటు ఎంబీబీఎస్, ఇటు క్విజ్ పోటీలకు చదవడం ఇబ్బందైనా.. ఓ చాలెంజ్‌గా తీసుకొని రాణిస్తున్నామని తెలిపారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపిస్తున్నారు ఈ హైదరాబాదీలు.
- వాంకె శ్రీనివాస్