ఈత.. మృత్యువాత!
ఆత్మకూర్ (కొత్తకోట): వేసవి వచ్చిందంటే పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువుల్లో, కాలువల్లో, సిమ్మింగ్పూల్లో, నీటి గుంటల్లో దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఆ సరదా ప్రాణాలను హరిస్తోంది.
సెలవులు ప్రారంభం
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇచ్చినప్పటినుంచి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి. ముఖ్యంగా పల్లెల్లో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. వచ్చిరాని ఈతతో బావులు, కుంటలు, కాల్వల్లోకి దిగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ.. పాటించాల్సినవి..
ఈత పూర్తిగా వచ్చినవారి సహకారంతో లోతు తక్కువగా ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈత నేర్చుకోవాలి. ఈత రానివారు తప్పనిసరిగా స్విమ్మింగ్ జాకెట్లు ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఉండవు కాబట్టి తుంగ, జిలుగు బెండ్లను కట్టగా చేసుకొని వీపుకు కట్టుకొని నీటిలోకి వెళ్లాలి. ద్విచక్ర వాహనాల ట్యూబ్లలో గాలి నింపుకొని కూడా శిక్షణ పొందవచ్చు. చిన్నపిల్లలు, ముఖ్యంగా 14సంవత్సరాల లోపు వయసున్న వారు చెరువు, బావుల్లోకి అసలు దిగకూడదు.
చెరువులు, కాల్వల్లో మట్టికోసం తీసిన గోతులు నీటి అడుగులో ఉండటం వల్ల మనకు కనిపించవు. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అప్రమత్తంగా వ్యవహరించాలి. చెరువుల్లో చేపలకోసం అమర్చిన వలలు ఉంటాయి. అందులోకూడా చిక్కుకొని ప్రమాదం కొనితెచ్చుకునే అవకాశం ఉంది. చెరువుల్లో బురద అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాళ్లు పూడుకుపోయి పైకి వచ్చే పరిస్థితి ఏమాత్రం ఉండదు కాబట్టి చెరువు గురించి పూర్తి అవగాహన ఉంటేనే అందులోకి వెళ్లాలి. చెరువు, కాల్వల్లో తామర తీగలు ఉన్న ప్రాంతంలో ఈతకు అస్సలు వెళ్లకూడదు.
కాల్వలు మరీ ప్రమాదకరం..
కాల్వల్లో నీటి ప్రవాహ వేగం గురించి అంచనా వేయలేం. ఇందులో ఈత వచ్చిన వారు దిగినా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ రానివారు కాల్వల్లో ఈతకు వెళ్లకపోవడం మంచిది. కాల్వ గేట్ల వద్ద నీరు పైకి నిశ్చలంగా కనిపించినా కింది భాగంలో ప్రవాహం ఉదృతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈతకు దిగరాదు. నీరు తక్కువగా ఉన్నప్పటికీ కాల్వ అడుగు భాగాన నాచు కారణంగా కాళ్లు జారిపోతాయి. పాడుబడిన బావుల్లోకి అసలు వెళ్లకూడదు. వీటి దారులు కూలిపోయే అవకాశం ఉటుంది. అలాగే బావుల్లో కార్బన్డయాక్సైడ్ వ్యాపించి ఉండవచ్చు.
నీటిలో పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చెరువులు, కాల్వల్లో పడి చిక్కుకు పోయిన వ్యక్తిని గుర్తించి బయటకు తీయగానే ఆయనకు ప్రాథమిక చికిత్స వెంటనే అందించాలి. గుండె కొట్టుకోకుంటే ఛాతిపై నొక్కాలి. వీలైనంత త్వరగా సమీప ఆసుప ఆసుపత్రికి తరలించాలి. నీటిలోంచి బయటకు తీసిన వెంటనే పడుకోబెట్టాలి. పొట్టపై మెల్లిగా నొక్కి నీటిని బయటకు తీయాలి. బాధితుడికి శ్వాస ఆడకపోతే తోటి వ్యక్తులు నోటి ద్వారా శ్వాస అందించాలి. ప్రథమ చికిత్స సమయంలో బాధితుడిని ప్రశాంతమైన, విశాలమైన ప్రాంతంలో ఉంచాలి. ఆసుపత్రిలో అర్హులైన వైద్యులచే చికిత్స చేయించాలి.