కూతుళ్లకు ఈత వద్దన్నాడని.. 3 లక్షల ఫైన్!
స్కూల్లో చదువుతున్న తన కూతుళ్లను ఈత నేర్చుకోడానికి అంగీకరించలేదని స్విట్జర్లాండ్లో ఓ తండ్రికి అక్కడి కోర్టు రూ. 3 లక్షల జరిమానా విధించింది. స్కూల్లో నిర్వహించే వివిధ క్యాంపులు, ఇతర కార్యక్రమాలకు కూడా అతడు వాళ్లను పంపేవాడు కాదని, అవి తమ మత విశ్వాసాలకు వ్యతిరేకం అంటూ చెప్పేవాడని తెలిసింది. స్కూలు నియమాలతో పాటు అధికారులు ఇంతకుముందు విధించిన ఉత్తర్వులను కూడా ఉల్లంఘించినందుకు అతడికి జరిమానా విధిస్తున్నట్లు అక్కడి జిల్లా కోర్టు తెలిపింది. జరిమానాతో పాటు ఆ తండ్రికి నాలుగు నెలల జైలుశిక్ష కూడా విధించాలని ప్రాసిక్యూషన్ వర్గాలు కోరాయి.
1990 నుంచి స్విట్జర్లాండ్లోనే ఉంటున్న ఈ బోస్నియా వాసి.. ఇక్కడి చట్టాలకు అనుగుణంగా ఉండటం లేదని వాదించారు. అయితే ఈ కుటుంబానికి కొన్నేళ్లుగా స్థానిక అధికారులతో వివాదాలు జరుగుతున్నాయి. బురఖా ధరించనిస్తే తప్ప తమ పిల్లలను స్కూలుకు పంపబోమని చెప్పినందుకు గత సంవత్సరం ఓ కోర్టు వీళ్లకు జైలుశిక్ష విధించింది. అయితే, అక్కడి సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టేసింది. మతస్వేచ్ఛ ఉండాలి కాబట్టి పెద్ద అమ్మాయికి బురఖా అనుమతించాలని చెప్పింది.