ఒక లైక్ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!
మీకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉందా? అందులో వచ్చే అప్‌డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్ ఏముందో చూసుకుని మరీ లైక్ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్ చేస్తే చాలు లైక్, లవ్ లాంటి బటన్లు యాక్టివేట్ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లండ్‌లో ఇలాగే లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి ఆ మొత్తంలో జరిమానా విధించారు.
విషయం ఏమిటంటే.. ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్ కొట్టినందుకు జడ్జిగారికి అతడి మీద కోపం వచ్చింది. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థిచినట్లు అయిందని జడ్జి చెప్పారు. ఆ చర్చలలో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్ దావాలు వేశారు. కెస్లర్ గురించి కామెంట్లు చేసిన కొంతమందిని కూడా కోర్టు దోషులుగా నిర్ణయించింది.
సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల మీద పరువునష్టం దావాలు బాగానే పడుతున్నాయి. ఇంతకుముందు ఒక ఫ్యాషన్ డిజైనర్ మీద ఇలాగే సోషల్ మీడియాలో అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు గాయన కోర్ట్నీ లవ్‌కు ఏకంగా 3.50 లక్షల డాలర్ల జరిమానా పడింది. అలాగే ట్విట్టర్‌లో అవమానకరమైన కామెంట్లు చేసినందుకు బ్రిటిష్ పత్రికలోని కాలమిస్టుకు 30వేల డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటివరకు ఇలా కామెంట్లు చేసినందుకు జరిమానాలు పడ్డాయి గానీ, ఒక కామెంటును లైక్ చేసినందుకు జరిమానా పడటం మాత్రం ఇదే తొలిసారి అని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇక మీద ఫేస్‌బుక్‌లో ఏమైనా లైక్ చేయాలన్నా కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండక తప్పదని అంటున్నారు.