మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో) బ్రహ్మారెడ్డి (ఫైల్)
ప్రకాశం, దర్శి: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువకుడిని పార్టీ ఉందంటూ పిలిచారు. అనంతరం హోమో సెక్స్(స్వలింగ సంపర్కం)లో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోని ఆ యువకుడు, విషయాన్ని అందరికీ చెబుతానని హెచ్చరించడంతో గొంతునులిమి చంపేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో గత జూన్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్రహ్మారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఓ మైనర్ సహా నలుగురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఓ నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన పెదరామిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (27) ఇటీవల టెట్‌లో ఉత్తీర్ణత సాధించాడు. డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నాడు. గత జూన్ 26న దర్శి నుంచి తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని ఓ సుబాబుల్ తోటలో అనుమానస్పద స్థితిలో అతడు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.
అందరికీ చెబుతానని హెచ్చరించడంతో...
దర్శికి చెందిన సాయికిరణ్‌కు ఫేస్‌బుక్‌లో బ్రహ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. జూన్ 26న పార్టీ ఉందంటూ అతడు బ్రహ్మారెడ్డిని తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని సుబాబుల్ తోట వద్దకు తీసుకెళ్లాడు. అతడితో పాటు తన స్నేహితులు జలపాటి శ్రావణ్‌కుమార్, పందిటి నరసింహారావు, మరో మైనర్ బాలుడితో కలిసి మద్యం సేవించారు. అనంతరం బ్రహ్మారెడ్డిని తమతో పాటు స్వలింగ సంపర్కంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో చెట్టుకు కట్టేశారు. మీరు ఇలాంటి వారని అందరికీ చెబుతానంటూ హెచ్చరించడంతో.. పరుపు పోతుందని భావించిన వారు అతడి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రావణ్ తన తండ్రి బ్రహ్మయ్యకు చెప్పడంతో అతడు నిందితులు పారిపోయేందుకు సహకరించడంతోపాటు సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులతో పాటు బ్రహ్మయ్యను కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment