8 నెలల్లో 1094 మందిని బలి తీసుకుంది
సాక్షి, న్యూఢిల్లీ : స్వైన్‌ఫ్లూ కలకలం కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ కారణంగా గడిచిన ఎనిమిది నెలల్లో దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1094కు చేరింది. వీరిలో గత మూడు వారాల్లోనే స్వైన్‌ఫ్లూతో బాధపడతూ 342 మంది మృత్యువాత పడ్డారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా డేటా ప్రకారం స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారిలో మహారాష్ట్ర, గుజరాత్ వాసులు అత్యధికంగా ఉన్నారు. ఈ రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూతో వరుసగా 437, 269 మరణాలు సంభవించాయి. రాజస్థాన్, కేరళ, ఢిల్లీలోనూ స్వైన్‌ఫ్లూ స్వైరవిహారం చేసింది.
గతం కంటే ఈ ఏడాది వ్యాప్తి చెందిన హెచ్1ఎన్1 భిన్నమైనదని ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ ఏసీ ధరీవాల్ పేర్కొన్నారు. దీని కారణంగానే స్వైన్‌ఫ్లూ వ్యాప్తి, మరణాలు ఈసారి అధికంగా ఉన్నాయని చెప్పారు. పూణేకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సైతం ఇదే అభిప్రాయాన్నివ్యక్తం చేసింది. స్వైన్‌ఫ్లూ సోకిన డయాబెటిస్, ఆస్త్మా, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే మధ్యవయస్కులు జాగ్రత్తగా ఉండాలని వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సర్వీసుల డైరెక్టర్ జనరల్ జగదీష్ ప్రసాద్ సూచించారు.