ప్రాజెక్టుల అధ్యయనం షురూ!
కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల పరిశీలన మొదలు
కృష్ణా బేసిన్లో ఏరియల్ సర్వే చేసిన నిపుణుల కమిటీ
నేడు గోదావరి పరీవాహకంలో పర్యటన
26, 27 తేదీల్లో నక్కలగండిని సందర్శించనున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటా మేరకు జలాల పూర్తిస్థాయి విని యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండు నదుల్లో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల మేరకు నికర, మిగులు జలాల వినియోగం కోసం చేపట్టిన పరీవాహక ప్రాజెక్టుల స్థితిగతులపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయిస్తోంది.
ప్రాజెక్టులకు వాస్తవ నీటి కేటాయింపు, లభ్యత నీరు, నిర్దేశించుకున్న ఆయకట్టు, ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన రిజర్వాయర్, పంప్‌హౌజ్‌ల నిర్మాణం తదితరాలపై నిశిత పరిశీలన చేసి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని, అవసరమైతే రీడిజైనింగ్ చేయాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తాజాగా రంగంలోకి దిగింది. ఇద్దరు చీఫ్ ఇంజనీర్ల నేతృత్వంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ సోమవారం రెండు హెలికాప్టర్లలో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పరిశీలించింది. మంగళవారం గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించనుంది.
పట్టుదలగా ఉన్న కేసీఆర్..
కృష్ణా బేసిన్లో 811 టీఎంసీలు, గోదావరిలో 900 టీఎంసీల మేర ఉమ్మడి కేటాయింపులున్న సంగతి తెలిసిందే. జలాలు అందుబాటులో ఉన్నా ప్రాజెక్టులు పూర్తికాని దృష్ట్యా రాష్ర్ట వాటాను పూర్తిగా వినియోగించుకోలేని పరి స్థితి నెలకొంది. గోదావరి బేసిన్ పరిధిలోని దేవాదుల(60 టీఎంసీలు), కంతనపల్లి(50 టీఎంసీలు), ప్రాణహిత-చేవెళ్ల(160 టీఎంసీలు)తో పాటు కృష్ణా పరిధిలో నెట్టెంపాడు(22 టీఎంసీలు), కల్వకుర్తి(25 టీఎంసీలు), భీమా(20టీఎంసీలు) తదితర ప్రాజెక్టుల నిర్మాణ పనులు ఏళ్లుగా కొనసాగుతున్నాయి.
కొన్ని చోట్ల భూసేకరణ సమస్యలు ఉండగా, మరి కొన్ని చోట్ల రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణంపై స్పష్టత లేదు. దేవాదుల, ప్రాణహిత విషయంలో ఒక ప్రాజెక్టు ఆయకట్టు, మరో ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో చేరి అయోమయంగా మారింది. ఇక ప్రాణహిత, ఎల్లంపల్లి వంటి ప్రాజెక్టుల్లో పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు కొనసాగుతున్నాయి. దీంతో నీటి కేటాయింపులు ఉన్నా వినియోగం లో మాత్రం రాష్ట్రం చతికిలపడుతోంది. దీనిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల పూర్తికి అవసరమైతే రీ డిజైనింగ్ చేస్తామని ప్రకటించి సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని వేశారు.
ప్రాజెక్టుల పరి శీలనకు ఏకంగా హెలికాప్టర్లను సైతం సమకూర్చారు. ఈ కమిటీ తాజాగా రాజోలిబండ డైవర్సన్ స్కీమ్(ఆర్డీఎస్) మొదలుకుని మహబూబ్‌నగర్ ప్రాజెక్టుల మీదుగా నల్లగొండలోని సాగర్, కొత్తగా చేపట్టనున్న నక్కలగండి వరకు పరిశీలన జరిపింది. మంగళవారం ప్రాణహిత ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం వరకు ఎల్లంపల్లి, మిడ్‌మానేరు మీదుగా ప్రాజెక్టుల పరిశీలన జరుపనుంది. దేవాదుల, కంతనపల్లి, వరదకాల్వ పరిసరాల్లోనూ పర్యటించి అక్కడి స్థితిగతులను అధ్యయనం చేయనుంది. పది, పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక అందజేసే అవకాశముంది. మరోవైపు ఈ నెల 26, 27 తేదీల్లో ఏదో ఒకరోజు నక్కలగండి ప్రాజెక్టును కేసీఆర్ సందర్శించనున్నారు. వచ్చే నెల తొలి వారంలో శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టును పరిశీలించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
మొరాయించిన హెలికాప్టర్
గండేడ్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సర్వే చేసేందుకు సోమవారం రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులు రంగారెడ్డి జిల్లా గండేడ్‌కు రెండు హెలికాప్టర్లలో వచ్చారు. సర్వే అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ఓ హెలికాప్టర్ సాంకేతిక సమస్యతో మొరాయించింది. దీంతో సిబ్బంది దానిని ఇలా నెట్టారు. ఆ తర్వాత అది స్టార్ట్ కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.