గ్రేటర్ బీజేపీకి కొత్త సారథి ?
► అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు
► మార్చి చివరినాటికి నియామకం
► ఏకగ్రీవానికి నేతల కసరత్తు
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నూతన నియమించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరెడ్డి పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో గురువారం అగ్రనాయకులు సమావేశమై డివిజన్కమిటీల ఏర్పాటుపై చర్చించాలని నిర్ణయించారు. డివిజన్ కమిటీల ద్వారా ఎన్నిక నిర్వహించడం కంటే... అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న దిశగా నేతలు సమాలోచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ గ్రేటర్ అధ్యక్ష పదవి రేసులో వెంకటరమణి, బవర్రాల్ వర్మ్, శ్యాం సుందర్ గౌడ్ పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. పార్టీకి చాలాకలంగా సేవలందిస్తోన్న ఉమా మహేందర్ కూడా ఈసారి గ్రేటర్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వీరిలో వెంకట రమణికి గతంలో నగర అధ్యక్షుడి గా పనిచేసిన అనుభవం ఉంది. ఒక వ్యక్తి రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేయవచ్చునన్న అవకాశం ఉన్నందున మరోసారి వెంకటరమణికి అవకాశం కల్పించవచ్చని తెలుస్తుంది. అయితే మిగతావారు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు అధ్యక్ష పదవినిచ్చి సముచిత స్థానం కల్పించాలని నేతలు భావిస్తున్నారు.
ఒకే ఒక్కడు.. : ప్రస్తుతం గ్రేటర్‌కు బి.వెంకటరెడ్డి, అర్బన్‌కు మీసాల చంద్రయ్య అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. నగరంలోని 150 డివిజన్లను రెండుగా విభజించి రంగారెడ్డి జిలాల పరిధిలోని 48 డివిజన్లను అర్బన్‌గా, మిగతా 108 డివిజన్లను గ్రేటర్ పరిధిలో ఉంచుతూ ఇద్దరికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో ఇద్దరు అధ్యక్షుల మధ్య సమన్వయం లేకపోవడంతో నామమాత్రపు ఫలితాలు వచ్చాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దృష్టి సారించిన అగ్రనేతలు ఇకపై గ్రేటర్‌లోని 150 డివిజన్లు, కంటోన్మెంట్ లోని 8 డివిజన్లు మొత్తం 158 డివిజన్లకు కలిపి ఒకరినే బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడిని నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం.