Sydney Olympics
-
తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ
2000, సెప్టెంబర్ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్ పేస్ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్ పతకంపై అంచనాలు లేవు. ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది. అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్లో పాల్గొనకపోగా, వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. ఆ రోజు ఏం జరిగిందంటే... ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్ అండ్ జర్క్ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్ విసిరారు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది. ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. అమ్మ అండగా.. మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్ లిఫ్టింగ్ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు. ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్ లియోనిడ్ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది. ఆపై జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్ చాంపియన్ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్ చాంపియన్‌షిప్ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్ మెడల్ వరకు సాగడం విశేషం. ఆమె స్ఫూర్తితోనే.. ‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో సైనా, సింధు, మేరీకోమ్వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్ దిగ్గజం అంజూ జార్జ్ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది. సిడ్నీలో భారత్ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్ గీతా ఫొగాట్ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. కొత్త బాధ్యతతో... సహచర వెయిట్‌లిఫ్టర్ రాజేశ్త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి తొలి వైస్ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు. -
మహాబలిని మట్టికరిపించిన వేళ...
అది 2000 సంవత్సరం... కొత్త మిలీనియం మొదలైన ఏడాది! సిడ్నీలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. 130 కేజీల విభాగంలో ఓ అమెరికా అనామక రెజ్లర్ రూలన్ గార్డెనర్ స్వర్ణం గెలిచాడు. ఒలింపిక్స్ అన్నాక కొత్త చాంపియన్లు అవతరించడం... పతకాలు గెలవడం సాధారణం. కానీ సిడ్నీ వేదికపై ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. ప్రపంచ రెజ్లింగ్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌గా పేరొందిన రష్యా మహాబలి, దిగ్గజ రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్ను గార్డెనర్ ఎంతో నేర్పుగా ఓడించాడు. ఈ శతాబ్దం విస్తుపోయే ఫలితాన్నిచ్చాడు. కరెలిన్తో తలపడుతున్నపుడు ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధిస్తేనే గొప్ప అనుకుంటారు. కానీ గార్డెనర్ ఏకంగా కరెలిన్ను ఓడించాడు. పసిడి పతకం కూడా గెలిచాడు. కనకంతో కెరీర్‌ను దిగ్విజయంగా ముగించాలని కలలు కన్న కరెలిన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. స్వదేశంలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన రీడ్, వర్జినియా దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఆఖరివాడు రూలన్ గార్డెనర్. కుటుంబానికి సొంతంగా డెయిరీ ఫామ్ ఉండటంతో గార్డెనర్ పాలు అమ్మేవాడు. ఆ తర్వాత రెజ్లింగ్‌లో రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన అతను సిడ్నీ ఒలింపిక్స్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చరిత్రలో భాగమయ్యాడు. కనీవినీ క్రేజ్‌ను ఒక్క రాత్రే సంపాదించాడు. ప్రపంచ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాడు. ఇంకేం ఆ తర్వాత ఓ వెలుగు వెలిగిన ఇతన్ని దురదృష్టం ప్రమాదాల పాలు చేస్తే.... అదృష్టమేమో ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ కాలమైతే ఆగదు. దాంతో క్రేజ్‌తో వచ్చిన క్యాష్ నిలువలేదు. తోడుగా వచ్చిన కష్టాలు వదిలేయలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడలేదు. చివరకు దివాళా తప్పలేదు. (స్టేడియాలు తెరుచుకోవచ్చు ) ఏకులా వచ్చి... సిడ్నీ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి గార్డెనర్ అనామక రెజ్లరైతే... అలెగ్జాండర్ కరెలిన్ మాత్రం దిగ్గజ రెజ్లర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒక్క బౌట్లోనూ ఓడిపోలేదు. 9 సార్లు విశ్వవిజేతగా... 13 సార్లు యూరోపియన్ చాంపియన్‌గా... వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో చాంపియన్‌గా నిలిచిన కరెలిన్ సిడ్నీ ఒలింపిక్స్‌లో ఏ ప్రత్యర్థికీ కనీసం ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా ఫైనల్ చేరాడు. 1997లో ఓ టోర్నీలో రూలన్ ఎదురైతే కరెలిన్ ఓ పట్టుపట్టి అలవోకగా 5–0తో మట్టికరిపించాడు. అంతేకాదు ఈసారీ స్వర్ణం గెలిస్తే ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు ఒలింపిక్ పసిడి పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారుడిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించేవాడు. కానీ అప్పటి 33 ఏళ్ల కరెలిన్ కలల్ని అమెరికాకు చెందిన నాటి 29 ఏళ్ల పాలబ్బాయి రూలన్ గార్డెనర్ భగ్నం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిగల తొలి రౌండ్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఇద్దరూ ఖాతా తెరువలేకపోయారు. అయితే రెండో రౌండ్ మొదలైన 23 సెకన్లకు గార్డెనర్ ఒక పాయింట్ సంపాదించాడు. ఇక మూడో రౌండ్లోనూ తన శక్తినంతా కూడదీసుకొని కరెలిన్ను నిలువరించిన గార్డెనర్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తుదకు 1–0తో కరెలిన్ను ఓడించి గార్డెనర్ అద్భుతం చేశాడు. దీంతో ఈ ఫలితం ‘అప్సెట్ ఆఫ్ ద సెంచరీ’ (శతాబ్ది విస్తుపోయే ఓటమి)గా పుటల్లోకెక్కింది. కరెలిన్ బంగారు యాత్ర ముగియడంతో అతని తన కెరీర్‌నూ ముగించాడు. ఆటకు టాటా చెప్పేశాడు. ‘అతనికి మరణం లేదు’ అనే టైటిల్‌తో... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అసాధారణ చాంపియన్లను చరిత్రలో నిక్షిప్తం చేసే పనిలో పడింది. అందుకే మేటి అథ్లెట్లను ‘తెర’మీదకు తెస్తోంది. ఈ ఉద్దండ పిండాల జాబితాలో గార్డెనర్ కూడా ఉన్నాడు. ఫైవ్ రింగ్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఐఓసీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ పేరు ‘రూలన్ గార్డెనర్ వోంట్ డై’. జూన్ 3న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది. ఇందులో చరిత్ర కెక్కిన సువర్ణ విజయంతో పాటు జీవితంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు, ప్రాణాలమీదికి తెచ్చిన ప్రమాదాలు క్లుప్తంగా చూపించారు. మృత్యుంజయుడు... సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక 2001లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ గార్డెనర్ పసిడి పతకం నెగ్గి జగజ్జేత అయ్యాడు. అయితే ఆ తర్వాతి ఏడాదే గార్డెనర్‌కు స్నో డ్రైవ్ ప్రమాదంలో ప్రాణం పోయినంత పనైంది. 2002 ఫిబ్రవరిలో మంచు సరస్సు వద్ద అతను నడుపుతున్న స్నో మొబైల్ ప్రమాదానికి గురైంది. దీంతో కన్నీటి చుక్క కూడా గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా 17 గంటలు అచేతనంగా పడిపోయాడు. తీవ్రంగా గాయమైన గార్డెనర్ కుడి కాలి వేళ్లను తొలగించాల్సి వచ్చింది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ గార్డెనర్ 130 కేజీల విభాగంలోనే కాంస్య పతకం గెలిచి కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2007 ఫిబ్రవరిలో మళ్లీ గార్డెనర్ మరో ప్రమాదం బారిన పడ్డాడు. అతను ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ఓ నదిలో కూలిపోయింది. అప్పుడు కూడా అతను మృత్యుంజయుడుగా నిలిచాడు. గంటకుపైగా ఈదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. తదనంతరం గార్డెనర్ వ్యక్తిగత జీవితం కూడా కుదుపునకు లోనైంది. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ రెండూ విడాకులకు దారి తీశాయి. మరోవైపు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలు రావడం... వాటి నుంచి ఎంతకి బయటపడలేక గార్డెనర్ చివరకు దివాళా తీశాడు. చివరకు తాను సాధించిన సిడ్నీ ఒలింపిక్స్ స్వర్ణాన్ని, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని, ఇతర విలువైన వస్తువులను అమ్ముకొని అప్పులు తీర్చాడు. అనంతరం మూడేళ్లపాటు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాక మళ్లీ రెజ్లింగ్‌వైపు వచ్చాడు. ప్రస్తుతం 48 ఏళ్ల గార్డెనర్ సాల్ట్‌లేక్ సిటీలోని ఓ హైస్కూల్లో రెజ్లింగ్ కోచ్‌గా చిన్నారులకు కుస్తీ పాఠాలు చెబుతున్నాడు. -
మన ‘మల్లి’ మెరిసిన వేళ....
ఒలింపిక్ వేదికపై మన తెలుగమ్మాయి సగర్వంగా నిలబడిన రోజది... భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా ఆమె మెడలో పడిన కాంస్య పతకం దేశంలోని అమ్మాయిలకు కొత్త స్ఫూర్తిని అందించింది. ఏళ్లుగా అంచనాల భారం మోస్తూ వెళ్లే మన అథ్లెట్లు మెగా ఈవెంట్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్న సమయంలో నేనున్నానంటూ బరువులెత్తి పరువు నిలబెట్టిన ఘనత ఆమె సొంతం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కరణం మల్లీశ్వరి విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట నుంచి ఒలింపిక్స్ వరకు ఎదిగి ఆమె సాధించిన పతకానికి భారత క్రీడా చరిత్రలో ‘తొలి మహిళ’గా ప్రత్యేక స్థానం ఉంటుంది. లెక్కల్లో చూస్తే అది కాంస్యమే కావచ్చు కానీ ఈ ఘనత బంగారు పతకంకంటే తక్కువేమీ కాదు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ టెన్నిస్ సింగిల్స్‌లో సాధించిన కాంస్యమే భారత్ ఖాతాలో చేరిన ఏకైక పతకం. ఆ తర్వాత కూడా మన క్రీడలు ఒక్కసారిగా ఏమీ మారిపోలేదు కాబట్టి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌పై కూడా పెద్దగా ఆశలు లేవు. పతకం సాధించగల సత్తా ఉన్న క్రీడాకారుల జాబితాలో కరణం మల్లీశ్వరిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి అప్పటికే మల్లీశ్వరి తనను తాను నిరూపించుకుంది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం (1994, 1995)తో పాటు మరో రెండు కాంస్యాలు కూడా సాధించింది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు కూడా ఉన్నాయి. సిడ్నీ సంచలనానికి వచ్చేసరికే మల్లీశ్వరి 11 స్వర్ణాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించింది. అయితే వెయిట్ కేటగిరీ మారిపోవడంతోపాటు ఇతర ఫలితాలు ఎలా ఉన్నా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మనవాళ్ల తడబాటు జగమెరిగిందే కాబట్టి ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. ఇదే చివరకు మల్లీశ్వరికి కూడా మేలు చేసింది. ఒకదశలో ఒలింపిక్స్‌కు ముందు ఉత్తరాది లాబీ ఒకటి పనిగట్టుకొని ఇండియాటుడే లాంటి పత్రికలో మల్లీశ్వరి గురించి తప్పుడు కథనాలు ప్రచురింపజేసి ఆమెను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా దృఢ చిత్తంతో ఆమె ముందడుగు వేసింది. స్వర్ణానికి గురి పెట్టి... 2000 సెప్టెంబర్ 19న సిడ్నీ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో పోరు జరిగింది. మహిళల 69 కేజీల విభాగంలో మల్లీశ్వరి బరిలోకి దిగింది. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మన వెయిట్‌లిఫ్టర్ ఎక్కడా తడబాటుకు గురి కాకుండా వరుసగా 105 కేజీలు, 107.5 కేజీలు, 110 కేజీలు బరువులెత్తింది. ఫలితంగా అత్యుత్తమ ప్రదర్శన 110 కేజీల వద్ద స్కోరు నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125 కేజీలు, 130 కేజీలు ఆమె ఎత్తింది. అయితే ఈ దశలో చేసిన చిన్న తప్పు ఆమెను వైఫల్యంలో పడేసింది. మల్లీశ్వరి స్వయంగా నిర్ణయం తీసుకుందో, లేక కోచ్‌లు చెప్పారో కానీ చివరి ప్రయత్నంలో ఎవరికీ అందనంత పైన ఉండి స్వర్ణం సాధించే పట్టుదలతో ఏకంగా 137.5 కేజీల బరువెత్తేందుకు సిద్ధమైంది. సాధారణంగా వెయిట్‌లిఫ్టర్లు తమ చివరి లిఫ్ట్ వచ్చేసరికి అంతకుముందు లిఫ్ట్కంటే గరిష్టంగా 2.5 కేజీల వరకు అదనంగా బరువు ఎత్తగలరు. అయితే ఒక్కసారిగా 7.5 కేజీలు పెరిగేసరికి మల్లీశ్వరి తడబడింది. ఫలితంగా మూడో యత్నంలో 137.5 కేజీలు ఎత్తలేక వదిలేసింది. తుది ఫలితంలో మొత్తంగా 240 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలుచుకుంది. స్వర్ణ, రజతాలు సాధించిన లిన్ వీనింగ్ (చైనా), ఎర్‌జెబెత్ (హంగేరి) ఎత్తిన మొత్తం (242.5 కేజీలు) మల్లీశ్వరికంటే 2.5 కేజీలే ఎక్కువ కావడం గమనార్హం. ఆమె కూడా 132.5 కేజీల లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే స్వర్ణం కోసం పోటీలో నిలిచేదేమో! లిన్ వీనింగ్, ఎర్‌జెబెత్ సమానంగా 242.5 కేజీలు ఎత్తినా... ఎర్‌జెబెత్ (68.52 కేజీలు) శరీర బరువుకంటే లిన్ వీనింగ్ (66.74 కేజీలు) తక్కువగా ఉండటంతో చైనా లిఫ్టర్‌కు స్వర్ణం దక్కింది. అభినందనల వర్షం... మల్లీశ్వరి కాంస్య పతకం కూడా భారత్‌కు సంబంధించి బంగారమే అయింది. సిడ్నీలో మనకు దక్కిన పతకం అదొక్కటే. మల్లీశ్వరికి కూడా తాను సాధించిన విజయం విలువ తెలిసేందుకు కొంత సమయం పట్టింది. దేశం యావత్తూ ఆమెకు జేజేలు పలికి ప్రశంసల్లో ముంచెత్తింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తికెక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మాన సత్కారాలతో ఆమెను అభినందించి భారీ పురస్కారాలు ప్రకటించింది. అయితే పతకం గెలిచిన మరుసటి రోజు ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అత్యంత ప్రత్యేకమైంది. ‘భారత్ కీ బేటీ’ అంటూ మల్లీశ్వరిని అభినందించిన ప్రధాని ఒక కవితను కూడా వినిపించారు. అయితే ఆ హిందీ కవిత తనకేమీ అర్థం కాలేదని ఆ తర్వాత ఆమె సరదాగా గుర్తు చేసుకుంది. మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ ఘనతపై త్వరలోనే సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. -
ఇర్విన్ మెడలో మళ్లీ బంగారం!
అమెరికా స్విమ్మర్ ఆంథోనీ ఇర్విన్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణం సాధించాడు. 22 ఏళ్ల వయసులోనే 2003లో రిటైర్మెంట్ ప్రకటించాడు. 2004 సునామీ బాధితుల సహాయార్ధం తన బంగారు పతకాన్ని ఇ-బేలో వేలం కోసం ఇచ్చేశాడు! అయితే గత లండన్ ఒలింపిక్స్‌తో మళ్లీ స్విమ్మింగ్‌లోకి పునరాగమనం చేసినా పతకం దక్కలేదు. కానీ ఈ సారి పట్టుదలగా పోరాడి తనకిష్టమైన 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో స్వర్ణం అందుకున్నాడు. 21.40 సెకన్ల టైమింగ్‌తో అతనికి ఈ పతకం దక్కింది. 35 ఏళ్ల వయసులో పసిడిని పట్టిన ఇర్విన్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో అతి పెద్ద వయసులో పతకం గెలిచిన ఆటగాడిగా ఘనత వహించాడు.