ఒలింపిక్ వేదికపై మన తెలుగమ్మాయి సగర్వంగా నిలబడిన రోజది... భారత జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా ఆమె మెడలో పడిన కాంస్య పతకం దేశంలోని అమ్మాయిలకు కొత్త స్ఫూర్తిని అందించింది. ఏళ్లుగా అంచనాల భారం మోస్తూ వెళ్లే మన అథ్లెట్లు మెగా ఈవెంట్ నుంచి రిక్తహస్తాలతో తిరిగి వస్తున్న సమయంలో నేనున్నానంటూ బరువులెత్తి పరువు నిలబెట్టిన ఘనత ఆమె సొంతం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కరణం మల్లీశ్వరి విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేట నుంచి ఒలింపిక్స్ వరకు ఎదిగి ఆమె సాధించిన పతకానికి భారత క్రీడా చరిత్రలో ‘తొలి మహిళ’గా ప్రత్యేక స్థానం ఉంటుంది. లెక్కల్లో చూస్తే అది కాంస్యమే కావచ్చు కానీ ఈ ఘనత బంగారు పతకంకంటే తక్కువేమీ కాదు.
1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ టెన్నిస్ సింగిల్స్‌లో సాధించిన కాంస్యమే భారత్ ఖాతాలో చేరిన ఏకైక పతకం. ఆ తర్వాత కూడా మన క్రీడలు ఒక్కసారిగా ఏమీ మారిపోలేదు కాబట్టి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌పై కూడా పెద్దగా ఆశలు లేవు. పతకం సాధించగల సత్తా ఉన్న క్రీడాకారుల జాబితాలో కరణం మల్లీశ్వరిని ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. నిజానికి అప్పటికే మల్లీశ్వరి తనను తాను నిరూపించుకుంది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం (1994, 1995)తో పాటు మరో రెండు కాంస్యాలు కూడా సాధించింది. వరుసగా రెండు ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు కూడా ఉన్నాయి.
సిడ్నీ సంచలనానికి వచ్చేసరికే మల్లీశ్వరి 11 స్వర్ణాలు సహా 29 అంతర్జాతీయ పతకాలు సాధించింది. అయితే వెయిట్ కేటగిరీ మారిపోవడంతోపాటు ఇతర ఫలితాలు ఎలా ఉన్నా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మనవాళ్ల తడబాటు జగమెరిగిందే కాబట్టి ఎవరూ అంచనాలు పెట్టుకోలేదు. ఇదే చివరకు మల్లీశ్వరికి కూడా మేలు చేసింది. ఒకదశలో ఒలింపిక్స్‌కు ముందు ఉత్తరాది లాబీ ఒకటి పనిగట్టుకొని ఇండియాటుడే లాంటి పత్రికలో మల్లీశ్వరి గురించి తప్పుడు కథనాలు ప్రచురింపజేసి ఆమెను మానసికంగా దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా దృఢ చిత్తంతో ఆమె ముందడుగు వేసింది.
స్వర్ణానికి గురి పెట్టి...
2000 సెప్టెంబర్ 19న సిడ్నీ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో పోరు జరిగింది. మహిళల 69 కేజీల విభాగంలో మల్లీశ్వరి బరిలోకి దిగింది. స్నాచ్‌లో మూడు ప్రయత్నాల్లో మన వెయిట్‌లిఫ్టర్ ఎక్కడా తడబాటుకు గురి కాకుండా వరుసగా 105 కేజీలు, 107.5 కేజీలు, 110 కేజీలు బరువులెత్తింది. ఫలితంగా అత్యుత్తమ ప్రదర్శన 110 కేజీల వద్ద స్కోరు నిలిచింది. క్లీన్ అండ్ జర్క్‌లో తొలి రెండు ప్రయత్నాల్లో 125 కేజీలు, 130 కేజీలు ఆమె ఎత్తింది. అయితే ఈ దశలో చేసిన చిన్న తప్పు ఆమెను వైఫల్యంలో పడేసింది. మల్లీశ్వరి స్వయంగా నిర్ణయం తీసుకుందో, లేక కోచ్‌లు చెప్పారో కానీ చివరి ప్రయత్నంలో ఎవరికీ అందనంత పైన ఉండి స్వర్ణం సాధించే పట్టుదలతో ఏకంగా 137.5 కేజీల బరువెత్తేందుకు సిద్ధమైంది.
సాధారణంగా వెయిట్‌లిఫ్టర్లు తమ చివరి లిఫ్ట్ వచ్చేసరికి అంతకుముందు లిఫ్ట్‌కంటే గరిష్టంగా 2.5 కేజీల వరకు అదనంగా బరువు ఎత్తగలరు. అయితే ఒక్కసారిగా 7.5 కేజీలు పెరిగేసరికి మల్లీశ్వరి తడబడింది. ఫలితంగా మూడో యత్నంలో 137.5 కేజీలు ఎత్తలేక వదిలేసింది. తుది ఫలితంలో మొత్తంగా 240 కేజీలతో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని గెలుచుకుంది. స్వర్ణ, రజతాలు సాధించిన లిన్ వీనింగ్ (చైనా), ఎర్‌జెబెత్ (హంగేరి) ఎత్తిన మొత్తం (242.5 కేజీలు) మల్లీశ్వరికంటే 2.5 కేజీలే ఎక్కువ కావడం గమనార్హం. ఆమె కూడా 132.5 కేజీల లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటే స్వర్ణం కోసం పోటీలో నిలిచేదేమో! లిన్ వీనింగ్, ఎర్‌జెబెత్ సమానంగా 242.5 కేజీలు ఎత్తినా... ఎర్‌జెబెత్ (68.52 కేజీలు) శరీర బరువుకంటే లిన్ వీనింగ్ (66.74 కేజీలు) తక్కువగా ఉండటంతో చైనా లిఫ్టర్‌కు స్వర్ణం దక్కింది.
అభినందనల వర్షం...
మల్లీశ్వరి కాంస్య పతకం కూడా భారత్‌కు సంబంధించి బంగారమే అయింది. సిడ్నీలో మనకు దక్కిన పతకం అదొక్కటే. మల్లీశ్వరికి కూడా తాను సాధించిన విజయం విలువ తెలిసేందుకు కొంత సమయం పట్టింది. దేశం యావత్తూ ఆమెకు జేజేలు పలికి ప్రశంసల్లో ముంచెత్తింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తికెక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మాన సత్కారాలతో ఆమెను అభినందించి భారీ పురస్కారాలు ప్రకటించింది. అయితే పతకం గెలిచిన మరుసటి రోజు ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ అత్యంత ప్రత్యేకమైంది. ‘భారత్ కీ బేటీ’ అంటూ మల్లీశ్వరిని అభినందించిన ప్రధాని ఒక కవితను కూడా వినిపించారు. అయితే ఆ హిందీ కవిత తనకేమీ అర్థం కాలేదని ఆ తర్వాత ఆమె సరదాగా గుర్తు చేసుకుంది.
మల్లీశ్వరి సిడ్నీ ఒలింపిక్స్ ఘనతపై త్వరలోనే సినిమా కూడా రూపుదిద్దుకోనుంది. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment