అది 2000 సంవత్సరం... కొత్త మిలీనియం మొదలైన ఏడాది! సిడ్నీలో విశ్వక్రీడలు జరుగుతున్నాయి. 130 కేజీల విభాగంలో ఓ అమెరికా అనామక రెజ్లర్ రూలన్ గార్డెనర్ స్వర్ణం గెలిచాడు. ఒలింపిక్స్ అన్నాక కొత్త చాంపియన్లు అవతరించడం... పతకాలు గెలవడం సాధారణం. కానీ సిడ్నీ వేదికపై ఎవ్వరూ ఊహించని ఫలితం వచ్చింది. ప్రపంచ రెజ్లింగ్‌లో ఆల్‌టైమ్ గ్రేటెస్ట్‌గా పేరొందిన రష్యా మహాబలి, దిగ్గజ రెజ్లర్ అలెగ్జాండర్ కరెలిన్‌ను గార్డెనర్ ఎంతో నేర్పుగా ఓడించాడు. ఈ శతాబ్దం విస్తుపోయే ఫలితాన్నిచ్చాడు. కరెలిన్‌తో తలపడుతున్నపుడు ప్రత్యర్థి ఒక్క పాయింట్ సాధిస్తేనే గొప్ప అనుకుంటారు. కానీ గార్డెనర్ ఏకంగా కరెలిన్‌ను ఓడించాడు. పసిడి పతకం కూడా గెలిచాడు. కనకంతో కెరీర్‌ను దిగ్విజయంగా ముగించాలని కలలు కన్న కరెలిన్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. స్వదేశంలో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.
అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన రీడ్, వర్జినియా దంపతులకు పుట్టిన తొమ్మిది మంది సంతానంలో ఆఖరివాడు రూలన్ గార్డెనర్. కుటుంబానికి సొంతంగా డెయిరీ ఫామ్ ఉండటంతో గార్డెనర్ పాలు అమ్మేవాడు. ఆ తర్వాత రెజ్లింగ్‌లో రంగప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన అతను సిడ్నీ ఒలింపిక్స్‌లో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. చరిత్రలో భాగమయ్యాడు. కనీవినీ క్రేజ్‌ను ఒక్క రాత్రే సంపాదించాడు. ప్రపంచ పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాడు. ఇంకేం ఆ తర్వాత ఓ వెలుగు వెలిగిన ఇతన్ని దురదృష్టం ప్రమాదాల పాలు చేస్తే.... అదృష్టమేమో ప్రాణాలతో బయటపడేలా చేసింది. కానీ కాలమైతే ఆగదు. దాంతో క్రేజ్‌తో వచ్చిన క్యాష్ నిలువలేదు. తోడుగా వచ్చిన కష్టాలు వదిలేయలేదు. ఆర్థిక నష్టాల నుంచి బయటపడలేదు. చివరకు దివాళా తప్పలేదు. (స్టేడియాలు తెరుచుకోవచ్చు )
ఏకులా వచ్చి...
సిడ్నీ ఒలింపిక్స్ మొదలయ్యే సమయానికి గార్డెనర్ అనామక రెజ్లరైతే... అలెగ్జాండర్ కరెలిన్ మాత్రం దిగ్గజ రెజ్లర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. తన 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఒక్క బౌట్‌లోనూ ఓడిపోలేదు. 9 సార్లు విశ్వవిజేతగా... 13 సార్లు యూరోపియన్ చాంపియన్‌గా... వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో చాంపియన్‌గా నిలిచిన కరెలిన్ సిడ్నీ ఒలింపిక్స్‌లో ఏ ప్రత్యర్థికీ కనీసం ఒక్క పాయింట్ కూడా సమర్పించుకోకుండా ఫైనల్ చేరాడు. 1997లో ఓ టోర్నీలో రూలన్ ఎదురైతే కరెలిన్ ఓ పట్టుపట్టి అలవోకగా 5–0తో మట్టికరిపించాడు. అంతేకాదు ఈసారీ స్వర్ణం గెలిస్తే ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు ఒలింపిక్ పసిడి పతకాలు నెగ్గిన మూడో క్రీడాకారుడిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించేవాడు.
కానీ అప్పటి 33 ఏళ్ల కరెలిన్ కలల్ని అమెరికాకు చెందిన నాటి 29 ఏళ్ల పాలబ్బాయి రూలన్ గార్డెనర్ భగ్నం చేశాడు. మూడు నిమిషాల వ్యవధిగల తొలి రౌండ్‌లో ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఇద్దరూ ఖాతా తెరువలేకపోయారు. అయితే రెండో రౌండ్ మొదలైన 23 సెకన్లకు గార్డెనర్ ఒక పాయింట్ సంపాదించాడు. ఇక మూడో రౌండ్‌లోనూ తన శక్తినంతా కూడదీసుకొని కరెలిన్‌ను నిలువరించిన గార్డెనర్ ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. తుదకు 1–0తో కరెలిన్‌ను ఓడించి గార్డెనర్ అద్భుతం చేశాడు. దీంతో ఈ ఫలితం ‘అప్‌సెట్ ఆఫ్ ద సెంచరీ’ (శతాబ్ది విస్తుపోయే ఓటమి)గా పుటల్లోకెక్కింది. కరెలిన్ బంగారు యాత్ర ముగియడంతో అతని తన కెరీర్‌నూ ముగించాడు. ఆటకు టాటా చెప్పేశాడు.
‘అతనికి మరణం లేదు’ అనే టైటిల్‌తో...
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అసాధారణ చాంపియన్లను చరిత్రలో నిక్షిప్తం చేసే పనిలో పడింది. అందుకే మేటి అథ్లెట్లను ‘తెర’మీదకు తెస్తోంది. ఈ ఉద్దండ పిండాల జాబితాలో గార్డెనర్ కూడా ఉన్నాడు. ఫైవ్ రింగ్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఐఓసీ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ పేరు ‘రూలన్ గార్డెనర్ వోంట్ డై’. జూన్ 3న విడుదలయ్యే ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమో ఇప్పటికే వచ్చేసింది. ఇందులో చరిత్ర కెక్కిన సువర్ణ విజయంతో పాటు జీవితంలో అతనికి ఎదురైన ఆటుపోట్లు, ప్రాణాలమీదికి తెచ్చిన ప్రమాదాలు క్లుప్తంగా చూపించారు.
మృత్యుంజయుడు...
సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక 2001లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ గార్డెనర్ పసిడి పతకం నెగ్గి జగజ్జేత అయ్యాడు. అయితే ఆ తర్వాతి ఏడాదే గార్డెనర్‌కు స్నో డ్రైవ్ ప్రమాదంలో ప్రాణం పోయినంత పనైంది. 2002 ఫిబ్రవరిలో మంచు సరస్సు వద్ద అతను నడుపుతున్న స్నో మొబైల్ ప్రమాదానికి గురైంది. దీంతో కన్నీటి చుక్క కూడా గడ్డకట్టే మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏకంగా 17 గంటలు అచేతనంగా పడిపోయాడు. తీవ్రంగా గాయమైన గార్డెనర్ కుడి కాలి వేళ్లను తొలగించాల్సి వచ్చింది. 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ గార్డెనర్ 130 కేజీల విభాగంలోనే కాంస్య పతకం గెలిచి కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2007 ఫిబ్రవరిలో మళ్లీ గార్డెనర్ మరో ప్రమాదం బారిన పడ్డాడు.
అతను ప్రయాణిస్తున్న తేలికపాటి విమానం ఓ నదిలో కూలిపోయింది. అప్పుడు కూడా అతను మృత్యుంజయుడుగా నిలిచాడు. గంటకుపైగా ఈదుతూ ప్రాణాలతో ఒడ్డుకు చేరాడు. తదనంతరం గార్డెనర్ వ్యక్తిగత జీవితం కూడా కుదుపునకు లోనైంది. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా ఆ రెండూ విడాకులకు దారి తీశాయి. మరోవైపు వ్యాపారాల్లో తీవ్రంగా నష్టాలు రావడం... వాటి నుంచి ఎంతకి బయటపడలేక గార్డెనర్ చివరకు దివాళా తీశాడు. చివరకు తాను సాధించిన సిడ్నీ ఒలింపిక్స్ స్వర్ణాన్ని, ఏథెన్స్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని, ఇతర విలువైన వస్తువులను అమ్ముకొని అప్పులు తీర్చాడు. అనంతరం మూడేళ్లపాటు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాక మళ్లీ రెజ్లింగ్‌వైపు వచ్చాడు. ప్రస్తుతం 48 ఏళ్ల గార్డెనర్ సాల్ట్‌లేక్ సిటీలోని ఓ హైస్కూల్‌లో రెజ్లింగ్ కోచ్‌గా చిన్నారులకు కుస్తీ పాఠాలు చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment