సిడ్నీ టెస్టుకు జాన్సన్ అనుమానం!
ప్రాక్టీస్‌కు డుమ్మా కొట్టిన పేసర్
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. దీంతో సిడ్నీలో భారత్‌తో ఈనెల 6న మొదలయ్యే నాలుగో టెస్టులో అతను ఆడటంపై అనుమానం నెలకొంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో జట్టుతో పాటు నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లొద్దని పేసర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్టు సమయానికి జాన్సన్ కోలుకోకపోతే అతని స్థానంలో స్టార్క్, సిడిల్లలో ఒకరిని తీసుకునే అవకాశం ఉంది.
‘జాన్సన్ ఫిట్‌నెస్‌పైనే నేను బరిలోకి దిగడం ఆధారపడి ఉంది. ఆడటానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నా. బిగ్‌బాష్‌లో నేను బాగానే బౌలింగ్ చేయగలిగా. అవకాశం వస్తే నాలుగో టెస్టులోనూ అదే విధంగా రాణించాలని కోరుకుంటున్నా. ఏ ఫార్మాట్లోనైనా నా సత్తా మేరకు రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని స్టార్క్ పేర్కొన్నాడు.
పిచ్‌లు మరీ నెమ్మదిగా ఉన్నాయి: హారిస్
గత యాషెస్ సిరీస్‌తో పోలిస్తే... భారత్‌తో సిరీస్‌కు నెమ్మదైన పిచ్‌లను రూపొందించారని పేసర్ హారిస్ అన్నాడు. బంతులు తక్కువ ఎత్తులో వస్తుండటంతో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేసేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందన్నాడు. ‘పిచ్‌లపై బౌన్స్, వేగం లేదు. అయినప్పటికీ తొలి రెండు టెస్టుల్లో ఫలితాలను రాబట్టాం.
ఇప్పటికీ మేం కోరుకుంటున్నది ఒక్కటే... పిచ్‌పై కొంత పచ్చిక, బౌన్స్ ఉండాలి’ అని హారిస్ తెలిపాడు. ఆసీస్ అటాక్ అద్భుతంగా ఉన్నప్పటికీ జట్టులో సిడిల్ ఉంటే మరింత బాగుంటుందన్నాడు. ‘సిడిల్‌ను తీసుకోవడమనేది సెలక్టర్ల ఇష్టం. హాజెల్‌వుడ్ బాగా రాణిస్తున్నాడు. మెల్బోర్న్లో మంచి పేస్‌తో ఆకట్టుకున్నాడు. అయితే సిడిల్ అనుభవాన్ని మేం కోల్పోతున్నాం’ అని హారిస్ అన్నాడు.