సైనా టైటిల్ నిలబెట్టుకునేనా..?
నేటి నుంచి సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ
లక్నో: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది సీజన్‌ను ఘనంగా ఆరంభించాలనే ఆలోచనలో ఉంది. నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానున్న సయ్యద్ మోదీ అంతర్జాతీయ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తను డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగ బోతోంది. లక్షా 20 వేల డాలర్ల విలువైన ప్రైజ్‌మనీ కలిగిన ఈ టోర్నీని ఉత్తరప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం నిర్వహిస్తోంది. 24 ఏళ్ల సైనా ఈ టోర్నీని 2009, 10లో నెగ్గింది.
తిరిగి గతేడాది విజేతగా నిలిచిన తనకు మహిళల సింగిల్స్‌లో ఈసారి మూడో సీడ్ పీవీ సింధు, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ‘టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గతేడాది సీజన్ అద్భుతంగా ముగిసింది. ఈ ఏడాది ఘనంగా ఆరంభించేందుకు సయ్యద్ మోదీ టోర్నీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మరోసారి విజేతగా నిలిచి సీజన్‌ను ప్రారంభించాలనుకుంటున్నాను.
సింధు, కరోలినా రూపంలో గట్టి ప్రత్యర్థులే ఉన్నారు’ అని సైనా తెలిపింది. బుధవారం సైనా తొలి రౌండ్లో యిన్ ఫన్ లిమ్ (మలేసియా)ను ఎదుర్కోనుంది. ఇక సింధు క్వాలిఫయర్‌తో టోర్నీ ఆరంభిస్తున్నా మూడో రౌండ్లో ఆరో సీడ్ పోర్న్‌టిప్ బురానాప్రసేర్ట్సక్తో అసలు పోటీ ఎదురుకానుంది. పురుషుల విభాగంలో గతేడాది రన్నరప్ కె.శ్రీకాంత్, పి.కశ్యప్, సాయి ప్రణీత్, అజయ్ జయరాం, ప్రణయ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు తొలి రౌండ్లో బై లభించింది.