కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆత్మహత్యా యత్నం!
పాత శ్రీకాకుళం : కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ ముస్తాక్ మహమ్మద్ శనివారం ఉదయం క్రిమి సంహార మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు వైద్యసేవల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ముస్తాక్ రిమ్స్‌లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు... ముస్తాక్ సోదరుడు సయ్యద్ మీర్ మహమ్మద్ నెలన్నర రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందారు.
దీంతో మనస్తాపానికి గురైన ముస్తాక్ అప్పటి నుంచే దిగాలుగా ఉంటున్నారు. మరోవైపు ఆయన తండ్రి కూడా తీవ్ర అనారోగ్యానికి గురయ్యూరు. ఈ క్రమంలో ముస్తాక్ శనివారం ఉదయం 11 గంటల సమయంలో క్రిమి సంహారక మందు తాగేశారు. ఆయన నోటి వెంట నురగలు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ డోల జగన్ రిమ్స్ వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముస్తాక్ ఆత్మహత్యా యత్నానికి కారణాలేమిటో తెలియరాలేదు.