‘ఆ ఉగ్రవాది మా వాడు కాదు’
నిరాధార ఆరోపణలు చేయొద్దంటూ భారత్‌కు పాక్ సూచన
ఇస్లామాబాద్: తమ దేశంలోని ఉగ్రవాద మూలాలపై పాకిస్తాన్ ఎప్పట్లానే పాత పాటే ప్రారంభించింది. ఉధంపూర్ దాడి అనంతరం భారత్‌లో సజీవంగా చిక్కిన ఉగ్రవాది మొహమ్మద్ నవేద్ యాకూబ్ తమ దేశస్తుడు కాదని యథావిధిగా పాత వాదనే వినిపిస్తోంది. పాక్ దేశస్తుడే అనేందుకు ఆధారాలుంటే తమకు అందజేయాలని వాదిస్తోంది. గతంలో ముంబై దాడుల అనంతరం చిక్కిన నర హంతకుడు కసబ్ విషయంలోనూ పాక్ అదే ధోరణి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నవేద్ యాకూబ్ పాకిస్తాన్‌కు చెందినవాడేనన్న భారత ప్రభుత్వ ఆరోపణలను పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ ఖాజీ ఖలీలుల్లా ఖండించారు. భారత ప్రభుత్వ వాదన నిరాధారమన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్నారు. ‘ఇప్పటికే చాలాసార్లు చెప్పాం. మొదట వారివద్ద ఉన్న ఆధారాలను మాకు అందజేయాలి. ఏదైనా ఘటన జరగగానే వెంటనే పాక్‌వైపు వేలెత్తి చూపడం సరికాదు’అని ఆయన అన్నారు. పాక్ జనాభా లెక్కల్లో మొహమ్మద్ నవేద్ యాకూబ్ పేరు లేదని పాక్ అధికారులు పేర్కొన్నట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి.
నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ రికార్డుల ప్రకారం ఫైసలాబాద్‌లో ‘మొహమ్మద్ నవేద్, తండ్రి పేరు మొహమ్మద్ యాకూబ్’ పేరుతో ఎలాంటి వివరాలు లేవని ఓ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఎక్స్‌ప్రెస్ ట్రి బ్యూన్ గురువారంఒక వార్తను ప్రచురించింది.
రెండు మాడ్యుల్స్లో శిక్షణ పొందా: నవేద్
ఉధంపూర్ ఉగ్రదాడి కేసు దర్యాప్తును గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తన చేతుల్లోకి తీసుకుంది. సజీవం గా చిక్కిన ఉగ్రవాది నవేద్ యాకూబ్‌పై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ సందర్భంగా.. లష్కరే సంస్థ తనకు ‘దౌర్ ఎ ఆమ్’, ‘దౌర్ ఎ ఖాస్’ అనే రెండు మాడ్యుల్స్లో శిక్షణ ఇచ్చిందని నవేద్ వెల్లడించాడు. అందులో మొదటి మాడ్యుల్లో శారీరక సామర్ధ్యం, పర్వతారోహణ, చిన్నచిన్న ఆయుధాలను ఉపయోగించడం.. తదితరాల్లో శిక్షణను ఇస్తారని, రెండో మాడ్యుల్లో ఏకే 47 వంటి అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించడం, బాంబులు, ఇతర పేలుడు పదార్ధాల తయారీలో ట్రైనింగ్ ఇస్తారని వివరించాడు.
ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా వద్ద సరిహద్దు కంచెను కత్తిరించి భారత్‌లో అడుగుపెట్టామని, మొదట తంగ్‌మార్గ్, బాబా రెషిల వద్ద, ఆ తరువాత అవంతిపుర, పుల్వామాలోని పర్వతప్రాంతాల్లో ఉన్న ఒక గుహలో మకాం వేశామని, ఆ తరువాత తాను, నొమిన్ ఉధంపూర్ చేరుకున్నామని అధికారులకు వెల్లడించాడు. ఈ ప్రాంతాలన్నింటినీ ఎన్ఐఏ బృందం పరిశీలించనుంది. నవేద్‌పై దేశంపై యుద్ధం ప్రకటించిన నేరంపై దర్యాప్తు జరిపేందుకు జమ్మకశ్మీర్ ప్రభుత్వం గురువారం విచారణ అనుమతి ఇచ్చింది.