ప్రసాద్‌కు జీవన సాఫల్యం... హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్’
నామినేట్ చేసిన కేంద్ర క్రీడా అవార్డుల కమిటీ
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ దిగ్గజాలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ సయ్యద్ షాహిద్ హకీమ్‌కు ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్’ పురస్కారం లభించనుంది. పుల్లెల గోపీచంద్ నేతృత్వంలోని కమిటీ ఆయన పేరును ఈ అవార్డుకు నామినేట్ చేసింది. ఆటగాడిగా, కోచ్‌గా, పరిపాలకుడిగా వివిధ దశల్లో హకీమ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు కు చెందిన సీనియర్ బ్యాడ్మింటన్ కోచ్ గంగుల వెంకట ప్రసాద్ కూడా జీవితకాల సాఫల్య పురస్కారం (కోచింగ్) అందుకోనున్నారు. అవార్డుల కమిటీ మొత్తం ముగ్గురి పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డుకు, ఐదుగురి పేర్లను లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ (కోచింగ్) అవార్డుకు, మరో ముగ్గురి పేర్లను ధ్యాన్‌చంద్ అవార్డుకు సిఫారసు చేసింది. కేంద్ర క్రీడా శాఖ అధికారిక ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ నెల 29న జాతీ య క్రీడా దినోత్సవం సందర్భంగా వీటిని అందజేస్తారు.
పారా కోచ్‌కు కూడా...
దశాబ్ద కాలం పాటు భారత అథ్లెటిక్స్ కోచ్‌గా పని చేసిన రామకృష్ణన్ గాంధీ (మరణానంతరం)కి ద్రోణాచార్య అవార్డు దక్కనుంది. నడకలో ఇటీవల విశేషంగా రాణించిన గుర్మీత్ సింగ్, బల్జీందర్ సింగ్, దీపమాలా దేవిలాంటి అథ్లెట్లు ఆయన శిక్షణలో ఆరితేరిన వారే. రామకృష్ణన్ ఏడాది క్రితం చనిపోయారు. పారా అథ్లెట్, రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తంగవేలు మరియప్పన్ కోచ్ సత్యనారాయణ (కర్ణాటక), కబడ్డీ కోచ్ హీరానంద్ కటారియా కూడా ‘ద్రోణాచార్య’కు నామినేట్ అయ్యారు. ధ్యాన్‌చంద్ అవార్డు భూపేందర్ సింగ్ (అథ్లెటిక్స్), సుమరై టెటె (హాకీ)లకు దక్కనుంది. జీవిత కాల సాఫల్య పురస్కారం సిఫారసు జాబితాలో బ్రిజ్‌భూషణ్ మొహంతి (బాక్సింగ్), పీఏ రాఫెల్ (హాకీ), సంజయ్ చక్రవర్తి (షూటింగ్), రోషన్ లాల్ (రెజ్లింగ్) ఉన్నారు.
బ్యాడ్మింటన్ వర్గాల్లో గంగూలీ ప్రసాద్‌గా చిరపరిచితుడైన జీఎస్ఎస్వీ ప్రసాద్ 1982 నుంచి ‘సాయ్’ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన శిక్షణలో అనేక మంది షట్లర్లు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టోర్నీ గెలిచిన సమయంలో అతనికి కోచ్‌గా ఉన్న ప్రసాద్... ఇప్పుడు గోపీచంద్ కమిటీ ద్వారానే అవార్డుకు అర్హత సాధించడం విశేషం. రెండేళ్ల పాటు ప్రసాద్, భారత హాకీ జట్టుకు ఫిజికల్ ట్రైనర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం యూఎస్ ఓపెన్ టోర్నీకి భారత జట్టుతో పాటు వెళ్లారు.
భారత ఫుట్‌బాల్ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో హకీమ్ ఒకరు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రఖ్యాత కోచ్ ఎస్ఏ రహీమ్ కుమారుడైన హకీమ్... ఆటగాడిగా కెరీర్ ముగిసిన అనంతరం జాతీయ జట్టు కోచ్‌గా కూడా అనేక మందిని తీర్చిదిద్దారు. ‘ఫిఫా’ ఇంటర్నేషనల్ రిఫరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ డీన్, ‘సాయ్’ రీజినల్ స్పోర్ట్స్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పని చేసిన 78 ఏళ్ల హకీమ్ భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం అండర్–17 ప్రపంచ కప్ కోసం ‘సాయ్’ చీఫ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.