ఒక్కసారిగా కంప్యూటర్లు ఆగిపోవడంతో..!
న్యూయార్క్: డెల్టా ఎయిర్లైన్స్ సంస్థ సోమవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంపెనీ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో డెల్టా విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డెల్టా ఎయిర్లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకొని అవస్థలు పడ్డారు.
అమెరికా అంతటా ఉన్న విమానాశ్రయాలతోపాటు, లండన్లోని విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాలు ఆగిపోయి తాము పడుతున్న అవస్థలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. మరోవైపు డెల్టా కంపెనీ తన ట్విట్టర్ పేజీలో వివరణ ఇచ్చింది. తమ కంపెనీ సిస్టమ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు ఆగిపోయాయని, త్వరలోనే ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నామని ట్వీట్ చేసింది.