నాడు ఫ్యాక్షనిస్టు: నేడు దొంగలకు దొర
నేరస్తులకు బెయిల్, ష్యూరిటీ వంటివి ఇప్పించడం
జైలులోని వారికి గంజాయి, సెల్ఫోన్ల సరఫరా
ప్రతిఫలంగా చోరీలలో వాటా
సుంకరి ప్రసాద్ నేరాంగికార పత్రంలో బయటపడ్డ నిజం
సాక్షి, సిటీబ్యూరో: అతను గతంలో ఫ్యాక్షన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు..పలుసార్లు జైలుకెళ్లి వచ్చాడు.. కొంత కాలం తర్వాత తన పంథా మార్చుకున్నాడు. నేరం చేసి జైలుకెళ్లిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించమే థ్యేయంగా పెట్టుకున్నారు. వారు చేసిన ప్రతి చోరీలో వాటా తీసుకుంటాడు. ఇలా సుమారు వంద మందికి పైగా నేరగాళ్లకు ఇతను దొర (బాస్)లా వెలుగుతున్నాడు. వారం క్రితం సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు పట్టుబడటంతో కుషాయిగూడ పోలీసులు ఇతడ్ని రిమాండ్‌కు తరలించారు. అయితే అతని నేర అంగీకార పత్రంలో మరిన్ని ఆసక్తిగల వివరాలు బయటపడ్డాయి.
18 ఏళ్లకే నేరబాట...
ప్రకాశం జిల్లాకు చెందిన సుంకరి ప్రసాద్ (40) ఘట్కేసర్లో ఉంటున్నాడు. 7వ తరగతి వరకు చదువుకున్న ఇతగాడు 18 ఏళ్ల వయసు(1991)లో బాంబు పేలుడు ఘటనలో జైలుకెళ్లాడు. ఆ తర్వాత ఫ్యాక్షనిస్టుగా మారి హత్య, హత్యాయత్నాలతో పాటు ప్రకాశం, కర్నూల్, కడప, నల్లగొండ, మెదక్, విజయవాడ, హైదరాబాద్, సైబారాబాద్లలో 100కుపైగా బెదిరింపులు, దోపిడీలు, ఇళ్లలో చోరీలు చేశాడు. ఆయా కేసులలో జైలు కెళ్లినప్పుడు పాత నేరస్తులతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా వందకుపైగా నేరగాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. వారందరికీ ఇతనే బాస్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇతను ప్రత్యక్షంగా నేరాలు చేయడం మానేశాడు.
తన వ ద్ద లిస్టులో ఉన్న వంద మంది నేరస్తులకు కావాల్సినప్పుడల్లా సహాయం చేస్తూ పోలీసుల దర్యాప్తులో తెరపైకి రాకుండా మొలుగుతున్నాడు. సుంకరి ప్రసాద్ కార్యకలాపాలపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందడంలో క్రైమ్ పోలీసులు అప్రమత్తమై వారం క్రితం అరెస్టు చేసి జైలుకు పంపారు.
నేరస్తులకు ఇలా సహకారం...
దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాలు చేసి జైలు పాలైన నేరస్తుడికి మద్దతుగా ఉంటూ బెయిల్ ఇప్పించడం, అందుకు ష్యూరిటీలను సమకూర్చడం, న్యాయవాదికి కావాల్సిన డబ్బులు అందించడం
జైల్లో ఉన్న నేరస్తులకు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు, గంజాయి, మిలాఖత్లు ఇప్పించడం
నేరస్తుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం
జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడ చోరీ చేయాలో కూడా సూచించడం
వచ్చిన వాటాలోంచే కొంత వీరి సహాయం కోసం ఖర్చు చేస్తాడు.