విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే తొలగింపు
ఏలూరు, న్యూస్‌లైన్ : ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్‌కు కూడా వెనుకాడబోమని జిల్లా జాయింట్ క లెక్టర్ టి.బాబూరావునాయుడు సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టరేట్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో ఆయన సమీక్షించారు.
ఈనెల 6న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించినప్పటికీ, నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై రాజీవ్ విద్యామిషన్ ఈఈ నౌజీనాల్పై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
24 గంటల్లోగా నూరు శాతం పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోతే విధుల నుంచి తొలగించడమే కాక, ఎన్నికల నిబంధనల ప్రకారం అరెస్ట్ చే యిస్తామన్నారు.వేసవి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మంచినీరు, కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం విధిగా కల్పించాల్సిందేనని జేసీ స్పష్టం చేశారు.
వెబ్‌కాస్టింగ్‌కు స్పందన
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 6,11 తేదీల్లో పోలింగ్ ప్రక్రియను చిత్రీకరించడానికి విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని బాబూరావునాయుడు చెప్పారు. జిల్లాలోని విద్యార్థులే కాక ఆసక్తి, సొంత ల్యాప్‌టాప్ ఉన్నవారు తమ పేర్లు, ఫోన్ నెంబర్ల వివరాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని నిక్నెట్ సెంటర్లో సంప్రదించాలని లేదా ఎన్ఐసీ అధికారి శర్మ సెల్ నంబర్ : 98856 32251కు ఫోన్‌చేసి పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
వెబ్‌కాస్టింగ్‌కు ఎంతమంది ముందుకు వచ్చినా అందరి సేవలను వినియోగించుకుంటామని, భోజన వసతి సౌకర్యాలతో పాటు రూ.500 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం కూడా అందిస్తామని జేసీ చెప్పారు. తొలిదశ పోలింగ్ జరిగే ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించాలని ట్రాన్స్‌కో ఎస్ఈ సూర్యప్రకాష్‌రావును జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో కె.ప్రభాకరరావు, రాజీవ్ విద్యామిషన్ పీవో ఎం.విశ్వనాథ్, ఈఈ నౌజీనాల్ పాల్గొన్నారు.