ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన పాలన
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటం.. ఉద్యోగులు, అధికారులు సైతం ప్రజలతో కలిసి ఉద్యమంలో మమేకం కావడంతో జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్ సిద్ధార్థజైన్, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు దృష్టి సారించారు. ఈ నెలాఖరు వరకూ వేచిచూసే ధోరణిని అవలంబించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈలోగా ప్రజలకు అందించాల్సిన సేవలపై పలు కీలక నిర్ణయూలు తీసుకున్నారు. ఉద్యమం నేపథ్యంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంతోపాటు, ధరలు పెరగకుండా చూడటం వంటి చర్యలు చేపట్టారు.
ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన ఉన్నతాధికారులు కిలో కందిపప్పును రూ.67కు, ఉల్లిని రూ.35కు అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, పాలనాపరమైన, ప్రజాపరమైన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్ మినహా వ్యవసాయ అధికారులంతా నిరవధిక సమ్మెలో ఉన్నారు. దీంతో గతేడాది ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహా రం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రూ.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. వ్యవసాయ అధికారులు విధుల్లోకి వస్తే గాని వీటిని సరి చేసే పరిస్థితి లేదు. ఈలోగా 46 మండలాల్లో నష్టపోయిన రైతుల జాబితా ఆధారంగా వారి అకౌంట్లను సరిచూసే పనిని జేడీ చేపట్టారు. ఇందుకు ఇతర జిల్లాలకు చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు.
రేషన్ పంపిణీకి ప్రత్యేక చర్యలు.. ఉద్యమం నేపథ్యంలో పేదలకు రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవసరమైతే పోలీసు బలగాలను రంగంలోకి దింపి సరుకులను పంపిణీ చేయూలనే యోచనకు ఉన్నతాధికారులు వచ్చారు. కౌలు రైతులకు రుణాలందించే విషయంలో ఇబ్బందులను పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ జేడీ, ఎల్డీఎం, జేసీ రంగంలోకి దిగారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కుంటుపడకుండా చూసే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు.