నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానం
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో నేరాల పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు నిర్వహించే ‘రోల్ బేస్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్ పోలీసు సబ్ డివిజన్ల నుంచి 40 మంది ఎస్సైలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పనసారెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, రోజూ జరుగుతున్న ప్రమాదాలను విశ్లేషించుకోవాలని సూచించారు.
స్టేషన్లలో కేసు నమోదు అనంతరం బలమైన సాక్షులను ప్రవేశపెట్టాలన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడం ద్వారానే నేరాల సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శిక్షణ కేంద్రం డీఎస్పీ కె.సీతారాములు, ఏఆర్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఎస్సైలు వి.మధుకర్, పి.గంగాధర్, కంప్యూటర్ విభాగం నిపుణులు శివాజీ చౌహాన్, శివకుమార్, ఎండీ. ఫారుఖ్‌అలీ తదితరులు పాల్గొన్నారు.