29 నుంచి తెలంగాణలో మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ (లబ్బీపేట): తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 1525 ఎంబీబీఎస్, 1140 బీడీఎస్ సీట్ల భర్తీకి ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజ్ చెప్పారు. బుధవారం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కౌన్సెలింగ్ వివరాలను తెలిపారు. 29న ఉదయం ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. అదేరోజు మధ్యాహ్నం జనరల్ కేటగిరి అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రారంభమై 30, 31 తేదీల్లో కూడా కొనసాగుతుందన్నారు.
ఆగస్టు 1,2,3 తేదీల్లో రిజర్వేషన్ కేటగిరి (ఎస్సీ, ఎస్టీ, బీసీ) అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. 4న సీఏపీ (ఆర్మీ), 5న ఎన్సీసీ, స్పోర్ట్స్‌అండ్ గేమ్స్, పోలీస్ అమర వీరుల పిల్లలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ, మసాబ్‌ట్యాంక్‌లోని ఓ కళాశాల, వరంగల్‌లోని వైద్య కళాశాల, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మెడికల్ కౌన్సిలింగ్ విషయమై ఈ నెల 13న జరగనున్న ఉన్నత విద్యాశాఖ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.