రేవంత్ తొడగొట్టి... మీసాలు మెలేయడం...
కరీంనగర్: కొడంగల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో బెయిల్ పై చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వ్యవహరించిన తీరుపై టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో బి.వినోద్‌కుమార్ విలేకర్లతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తొడగొట్టి ... మీసాలు మెలేయడం సాక్షులను బెదిరించడమే అని ఆయన అభిప్రాయపడ్డారు.
మాకు వ్యతిరేకంగా ఉంటే అంతుచూస్తామన్నట్లు రేవంత్ వ్యవహరించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా లేరని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న చంద్రబాబు .... రేవంత్‌ను పావులా వాడుకున్నారని విమర్శించారు. ఈ నెల 21వ తేదీ లోపు హైకోర్టు విభజన లేకుంటే పార్లమెంట్‌ను స్తంభింపచేస్తామని ఎంపీ వినోద్ ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.